Special Story On Rakhi Making Peddapalli : పెద్దపల్లికి చెందిన ఇల్లందుల మహిళ రజనీ, ఆమె భర్త కృష్ణమూర్తి ఉపాధి కోసం వీరు చిరు వ్యాపారాలు చాలానే చేశారు. ఏ సీజన్‌కు తగ్గట్టు అప్పుడు అవసరమయ్యే వ్యాపారం చేసినా అవన్నీ నష్టాలనే మిగిల్చాయి. ఈ క్రమంలోనే కృష్ణమూర్తి ఓ చిన్న రాఖీ(Rakhi) కొట్టు నిర్వహించారు. అందులో పెద్దగా లాభాలు రాకపోవడంతో దాన్ని వదిలేశారు. భర్త వదిలేసిన ఆ వ్యాపారాన్నే రజనీ ముందుకు నడిపించారు. మొదట్లో కోల్‌కతా, రాజ్‌కోట్, అహ్మదాబాద్, దిల్లీ, జోధ్‌పూర్ ప్రాంతాల నుంచి రాఖీలను కొనుగోలు చేసి స్థానిక మార్కెట్లలో అమ్మేవాళ్లు.
Rakhi wholesale Market In Peddapalli :పదిహేనేళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగించినా పెద్దగా లాభాలు రాకపోవడంతో తామే సొంతంగా రాఖీలు(Rakhi Pouranmi) తయారు చేయాలనే ఆలోచన చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసిన రాఖీలు అక్కడి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడి ప్రజల అభిరుచికి తగ్గట్టుగా రాఖీల తయారీకి శ్రీకారం చుట్టారు. అలా ఏడెనిమిదేళ్ల క్రితం మొదలుపెట్టిన ఈ వ్యాపారం...ఇప్పుడు ఎంతోమంది మహిళలకు ఉపాధినిచ్చే కుటీర పరిశ్రమగా మారింది. రజనీ చదివింది పదో తరగతే కానీ అత్మస్థైర్యంతో ముందడుగేసింది. మొదట్లో భర్త సహకారం తీసుకున్నా తర్వాత తానే సొంతంగా అభివృద్ధి సాధించింది. మరో 250 మంది మహిళలకు ఉపాధిని అందించగలుగుతోంది.
"ఇతర రాష్ట్రాల నుంచి విక్రయించగా మిగిలిపోయిన రాఖీలూ, పాడయినవాటిని విప్పి ఎలా చేశారో గమనిస్తే చేయడం సులువే అనిపించింది. వాటితోనే కొంత సాధన చేసి తర్వాత కొత్త డిజైన్లు ప్రయత్నించాను. రాఖీలు తయారు చేసేవారికి తయారీలో ఉపయోగపడే నూలు, పాలిస్టర్ దారాలు, పెండెంట్లు, పూసలు, రాళ్లు లాంటి మెటీరియల్ అందజేసి తగిన వేతనం అందజేస్తున్నాను. దారాలని గుజరాత్, రాజస్థాన్, దిల్లీ, అహ్మదాబాద్‌ల నుంచి కొనుగోలు చేయగా.. పెండెంట్లు ముంబయి, రాజ్‌కోట్, దిల్లీల నుంచి తెచ్చుకుంటున్నాం. ఇక పూసలు, రాళ్లు వంటివి చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. వీటితో పాటు ప్యాకింగ్ మెటీరియల్స్‌ను ముంబయి నుంచి కొంత కొనుగోలు చేస్తూ మిగతాది సొంత వర్క్‌షాప్‌లో తయారు చేస్తాం. పరిశ్రమలో నిత్యం 50 మంది ఆడవాళ్లు రాఖీలు తయారుచేస్తారు. ఇళ్లకు ముడిసరుకు పంపించే విధానంలో మరికొందరు పనిచేస్తారు. వారందరూ రోజుకి రూ.400 నుంచి రూ.800 వరకు సంపాదించే విధంగా తయారీ కొనసాగుతోంది." -రజనీ, రాఖీ ఉత్పత్తిదారు
Raksha Bandhan 2023 :దేశవ్యాప్తంగా వీటిని అమ్మేందుకు మార్కెటింగ్ సిబ్బంది ఉన్నారని రజనీ భర్త కృష్ణమూర్తి తెలిపారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తాయని వెల్లడించారు. ఏటా రూ. 4 నుంచి రూ. 5 కోట్ల వరకు టర్నోవర్ వస్తుందని చెప్పారు. గతంలో హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలుచేసిన వారు ఇక్కడి వెరైటీలు చూసి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.