తెలంగాణ

telangana

ETV Bharat / state

బొగ్గు గనుల్లో నిరసనల సెగ - పెద్దపల్లి జిల్లాలో బొగ్గు కార్మికుల నిరసన

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీల్లో బొగ్గు గనుల ప్రైవేటీకరణ అంశాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ వల్ల భవిష్యత్తులో బొగ్గు పరిశ్రమ మనుగడకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టిన జాతీయ సంఘాలు సమ్మెకు వెళ్లేందుకు సమాలోచనలు జరుపుతున్నాయి.

singareni labor protest at godavarikhani in peddapalli district against central government
బొగ్గు గనుల్లో నిరసనల సెగ

By

Published : May 25, 2020, 8:52 AM IST

500 బొగ్గు బ్లాకులను బహిరంగ వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించనున్నట్లు కేంద్రం ఇటీవల ప్రకటించింది. ఈ ప్రకటనపై కార్మిక సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకోవడాన్ని నిలిపివేసేందుకే ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నట్లు కేంద్రం చెబుతున్నా దాని వెనుక కుట్ర దాగి ఉందని అవి ఆరోపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కోల్‌ ఇండియా పరిధిలో ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిశా, పశ్చిమబంగ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో బొగ్గు గనులున్నాయి. తెలంగాణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో సింగరేణి నడుస్తోంది. ప్రైవేటు సంస్థల బొగ్గు గనులున్నా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. 90 శాతం బొగ్గు ప్రభుత్వ రంగ పరిశ్రమల నుంచే వస్తోంది. జాతీయకరణ చట్టం ప్రకారం బొగ్గు పరిశ్రమ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. కాగా దీన్ని సవరించిన కేంద్రం బొగ్గు బ్లాకుల కేటాయింపునకు బహిరంగ వేలం పిలిచే విధంగా మార్పు చేసింది.

రెండు సార్లు సమ్మె ఆయుధం

కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ప్రభుత్వ రంగ పరిశ్రమలు కనిపించని పరిస్థితి నెలకొంది. బొగ్గు పరిశ్రమ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా గతంలో చట్టాలుంటే, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి గనులు వెళ్లేలా వాటిని సవరించారు. దీన్ని అడ్డుకోవడానికి జాతీయ కార్మిక సంఘాలు కార్యాచరణ రూపొందిస్తున్నాయి.

గతంలో ఇలాగే కేంద్రం బొగ్గు రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు యత్నించిన క్రమంలో సమ్మె నోటీసు జారీ చేశాయి. దీనిపై చర్చలకు ఆహ్వానించిన కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, తమ ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. రెండు సార్లు ఇలాగే ప్రకటించి జాతీయ కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. కాగా కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ను అనుకూలంగా మలచుకున్న కేంద్రం బొగ్గు బ్లాకులను ప్రైవేటు వారికి అప్పగించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపిస్తున్నారు.

కార్మిక ప్రయోజనాలకు దెబ్బ

బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే కార్మిక హక్కులు అమలయ్యే అవకాశాలుండవు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల్లోని కార్మికులకు ఒకే వేతనాలు, ప్రయోజనాలు అమలవుతున్నాయి. ఇందుకోసం జాతీయ స్థాయిలో యాజమాన్యం, కార్మిక సంఘాలు ద్వైపాక్షిక సంయుక్త వేతన సవరణ ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

కార్మికునికి ఎంత వేతనం ఉండాలి? నైపుణ్యం ఉన్న వారికి ఎంత? గ్రేడింగ్‌, సాంకేతిక సిబ్బంది, సూపర్‌వైజర్‌, ఆపరేటర్‌లకు వారి పని విధానం ఆధారంగా వేతనాలు నిర్ణయిస్తారు. దీంతో పాటు ఏడాది పొడవునా అమలయ్యే ప్రయోజనాలపైనా ఒప్పందం చేసుకుంటారు. ఇవి అయిదేళ్ల పాటు అమలులో ఉంటాయి. బొగ్గు బ్లాకులు ప్రైవేటుపరం అయితే ఇలాంటి ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉండదు. గనులు దక్కించుకున్న సంస్థలు నిర్ణయించిన మేరకే వేతనాలు, ప్రయోజనాలు వర్తిస్తాయి.

ABOUT THE AUTHOR

...view details