గోదావరిఖని, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ సమయానికి సాధారణ ఓపీ వైద్య విభాగం మొత్తం జ్వర బాధితులతో కిక్కిరిసి పోయేది. ప్లేట్‌లెట్స్ అందక డెంగీతో చనిపోయిన సందర్భాలు జిల్లాలో లేనప్పటికీ ఈ వ్యాధి మూలంగా ఇబ్బందులు పడ్డవారి పరిస్థితులు అంతా ఇంతా కాదు. గతంలో వైద్యులు కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల ఎంత ప్రచారం చేసినప్పటికీ పట్టించుకోని ప్రజలు కొవిడ్ విషయంలో అత్యంత జాగ్రత్తలు పాటించారు.
మార్చి 22 నుంచి ఇప్పటి వరకు వరుసగా లాక్‌డౌన్, అన్‌లాక్ ప్రక్రియలతో ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెరిగేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఈ సమయానికి వందల సంఖ్యలో నమోదు కావాల్సిన మలేరియా, డెంగీ, చికున్‌గన్యా, ఇతర వ్యాధుల కేసులు నెలకు ఒకటి, రెండు కేసులకే పరిమితమయ్యాయి. కరోనా వైద్యసేవల్లో తలమునకలైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ అంటు వ్యాధుల తగ్గుముఖంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు జిల్లా యంత్రాంగం కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించి పకడ్బందీగా అమలు చేసింది. రామగుండం నగరపాలక సంస్థ, 3 పురపాలికలు, 266 గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య నిర్వహణ, యాంటీలార్వా, ఫాగింగ్ కార్యక్రమాలు విరివిగా చేపట్టడం వల్లే ఇతర వ్యాధులు పరారయ్యాయి.
సీజనల్ వ్యాధులు తగ్గడానికి ప్రధాన కారణాలివే
- కరోనా నుంచి రక్షణ కోసం ముఖ కవచాలు ధరించడం వల్ల దుమ్ము, ధూళి శరీరంలోకి ప్రవేశించ లేదు.
- కరోనా భయంతో రహదారులపై జన, వాహన సంచారం తగ్గింది. రహదారులపై వాతావరణ కాలుష్యం వల్ల ఎక్కువగా సోకే ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ వ్యాధులు,అలర్జీలు ఎక్కువ నమోదు కాలేదు.
- ఇంటి వైద్యమే రోగాలకు మందు అనే చందంగా పోపుల పెట్టెను తెరిచి అల్లం, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, తేనె, నిమ్మరసం, కషాయం వంటివి ఎక్కువగా తీసుకున్నారు.
- సీ విటమిన్, బీ కాంప్లెక్స్, మల్టీ విటమిన్, విటమిన్ డీ-3, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, అజిత్రోమైసిన్ మాత్రలను విరివిగా ఉపయోగించారు. వీటితో పాటు హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు వాడారు. గతంలో దోమలు కుట్టడం వల్ల వచ్చే డెంగీ, మలేరియా వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉపయోగించేవారు. వీటి వాడకంతో ఈ వ్యాధులు తగ్గాయని వైద్యులు చెబుతున్నారు.