తెలంగాణ-ఏపీ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పే అంశంపై హైదరాబాద్‌లో సోమవారం కీలక చర్చలు జరపనున్నారు. అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోవడంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఇరు రాష్ట్రాలు ఆర్టీసీ బస్సులు తిప్పే కిలోమీటర్లపై ఏకాభిప్రాయం కుదిరింది. చెరో లక్ష 60 వేల కిలోమీటర్ల మేరకు బస్సులు తిప్పాలని నిర్ణయించారు. ఏ రూట్లలో ఎవరు ఎన్ని బస్సులు తిప్పాలనే విషయమై కూడా ఇరురాష్ట్రాల అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. వీటిపై ఈడీ స్థాయి అధికారులు ఇప్పటికే చర్చించి సానుకూలత వ్యక్తం చేశారు.
సోమవారం రాత్రి నుంచి తెలంగాణ-ఏపీ మధ్య బస్సు సర్వీసులు..? - TSRTC Latest news
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు మార్గం సుగమమైంది. బస్సులు తిప్పేందుకు అధికారులు చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు సఫలమయ్యాయి. అంతరాష్ట్ర ఒప్పందంపై చర్చించేందుకు సోమవారం హైదరాబాద్‌లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు తుది దఫా చర్చలు జరపనున్నారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మధ్యాహ్నం 2.45 గంటలకు భేటీ జరగనుంది.రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
సోమవారం నాటి సమావేశంలో వీటన్నింటిపై ఎండీల స్థాయిలో మరోసారి చర్చించి ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసే ఆవకాశాలున్నాయి. అనంతరం తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ఎండీలు అంతరాష్ట్ర ఒప్పందంపై సంతకాలు చేస్తారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఒప్పందం కుదిరిన వెంటనే ఏపీలోని పలు జిల్లాల నుంచి హైదరాబాద్ సహా తెలంగాణ ప్రాంతాలకు బస్సులు ప్రారంభం కానున్నాయి. బస్సులు తిప్పేందుకు సిద్దంగా ఉండాలని అన్ని జిల్లాల అధికారులకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. చర్చలు సఫలమైతే సోమవారం రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి:ఎన్నికల్లో గెలుపు కోసం దిగజారే పనిని భాజపా చేయదు: అర్వింద్