Ramagundam NTPC : విద్యుత్తు ఉత్పత్తిలో పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రాజెక్టులు రికార్డు సృష్టిస్తున్నాయి. ఎన్టీపీసీలో 2వేల600 మెగావాట్లతో పాటు సోలార్, ఫ్లోటింగ్ సోలార్, ప్లాంట్ల ద్వారా 4,310 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన 4 వేల మెగావాట్లలో ఫేజ్-1 కింద 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తైంది. అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో చేపడుతున్న ప్రాజెక్టులో మొదటగా చిమ్నీ నిర్మాణం పూర్తి చేశారు.
Ramagundam NTPC news : గత మార్చి 24న ఇందులో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రారంభించారు. అలాగే మరో 800 మెగావాట్ల రెండో యూనిట్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌జీడీ నిర్మాణం, యాష్ హ్యాండ్లింగ్ సిస్టమ్ పూర్తితో స్టీమ్ బ్లోయింగ్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. వచ్చే జూన్ నాటికి ఈ యూనిట్ కూడా అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.
Ramagundam NTPC updates : రాష్ట్రంలో ఇప్పటికే 15వేల 498 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఉంది. ఎండల తీవ్రతతో మున్ముందు ఇదింకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐతే, ఫేజ్-2 కింద 2వేల 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణ పనులను అగ్రిమెంట్ జరిగిన వెంటనే ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు కూడా సిద్ధం చేశామని ప్రకటించారు. అగ్రిమెంట్ పూర్తైతే రామగుండం థర్మల్ పవర్ కార్పోరేషన్ ఉత్పత్తి 6795 మెగావాట్లకు చేరనుంది.
Ramagundam NTPC latest record : ఇప్పటి వరకు మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్ ఎన్టీపీసీలో 4760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో ముందంజలో ఉంది. రామగుండం ఎన్టీపీసీ అధికారులు థర్మల్ విద్యుత్‌కు మాత్రమే పరిమితం కాకుండా సోలార్, నీటిపై తేలియాడే సౌరపలకలతోనూ విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ కేంద్రం 100మెగావాట్లది రామగుండంలో నిర్మించారు. దానికి అదనంగా 85మెగావాట్లు త్వరలోనే జోడించబోతున్నారు. గతంలో నిర్మించిన థర్మల్ పవర్ ప్లాంట్ల వలె కాక కొత్తగా నిర్మించే ప్లాంట్లలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నారు.
ఇప్పటికే 1600మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం కాగా.. ఇది మరింతగా విస్తరిస్తే దేశంలోనే అతిపెద్ద అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రంగా ఎన్టీపీసీ రామగుండం నిలుస్తుందని అధికారులు చెబుతున్నారు. గతంలో పరిశ్రమలు ఇతరత్రా వినియోగాల కారణంగా తమిళనాడు లో అత్యధికంగా 16వేల మెగావాట్ల విద్యుత్‌ను వినియోగిస్తే.. ఆంధ్ర, తెలంగాణా ఉమ్మడిరాష్ట్రాలు కలిపి 16వేల మెగావాట్ల విద్యుత్‌ను వినియోగించేవి. ఇప్పుడు తెలంగాణ మాత్రమే 15వేలకు పైగా మెగావాట్ల విద్యుత్‌ని వినియోగిస్తోంది. ఎత్తిపోతల పథకాలు, పారిశ్రామిక వృద్ధి, ఐటీ పరిశ్రమ వృద్ధి చెందుతోన్న కారణంగా విద్యుత్ వినియోగం మరింతగా పెరిగే అవకాశం ఉందని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సునీల్ కుమార్ చెబుతున్నారు. అందుకు ఎన్టీపీసీ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
ఎన్టీపీసీకి రామగుండంలో 9వేల 500 ఎకరాల స్థలం ఉంది. ఇప్పటికే అక్కడ 2వేల600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు సంస్థ నిర్వహిస్తోంది. విభజన చట్టంలోని హామీ అమలులో భాగంగా తొలి విడతగా 1,600 మెగావాట్ల అదనపు సామర్థ్యంతో రామగుండం ప్లాంట్ విస్తరణ పనులను ఎన్టీపీసీ ఇప్పటికే ప్రారంభించింది. మిగిలిన 2వేల400 మెగావాట్ల ప్లాంట్లకు స్థల కేటాయింపుల విషయంలో ఎన్టీపీసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగాయి. చివరకు నల్లగొండ జిల్లా దామరచర్లలో స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకురాగా... ఎన్టీపీసీ మాత్రం రామగుండంపైనే పూర్తి ఆసక్తి ప్రదర్శిస్తూ వచ్చింది. మొత్తం 4వేల మెగావాట్ల ప్లాంట్లను రామగుండంలోనే నిర్మించాలనే ప్రతిపాదనను సంస్థ సీఎమ్‌డీ అరుప్‌రాయ్ తాజాగా సీఎం కేసీఆర్ ముందుంచారు.