కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు తప్పవని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి రామగుండం కమీషనరేట్ పరిధిలో రామగిరి, మంథని ప్రాంతాల్లో ఆయన పర్యటించి.. లాక్డౌన్ అమలు పరిస్థితులను పర్యవేక్షించారు.
గత మూడు రోజులుగా లాక్డౌన్ కఠినంగా అమలు అవుతుందని.. ఇప్పటివరకు ప్రజలు ఇంటికే పరిమితమై.. సహకరిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కొంతమంది మాత్రం రోడ్లపైకి రావడంతో సుమారు 2700 మందిపై కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కరోనా వ్యాప్తి నివారణ అందరి భాద్యతగా గుర్తించాలని అన్నారు. ఇందుకోసం అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కోరారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం 6 నుంచి 10 వరకు యథావిధిగా పనులు కొనసాగించవచ్చని తెలిపారు. అత్యవసరసేవలు, వ్యవసాయ అనుబంధ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పోలీస్, వైద్యారోగ్య, మీడియాకు మినహయింపు ఉందని చెప్పారు. మినహయింపులేని వారు రోడ్లపైకి రావద్దని.. ఇతరులను ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు.