తెలంగాణ

telangana

ETV Bharat / state

వరద వదిలినా.. బురద వదలలేదు..! - People suffering from mud in Mantrapuri

మంత్రపురిగా పేరొందిన మంథనిలో వరద.. ప్రజలకు తీరని కష్టం మిగిల్చింది. ఇళ్లు, దుకాణాల్లోకి చొచ్చుకు రావటంతో భారీ నష్టం వాటిల్లింది. ప్రస్తుతం నీరు తొలగిపోయినప్పటికీ.. వరద గాయాలు మానలేదు. తమకు నిలువనీడ లేని పరిస్థితి తలెత్తిందంటూ బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు.

వరద వదిలినా.. బురద వదలలేదు..!
వరద వదిలినా.. బురద వదలలేదు..!

By

Published : Jul 21, 2022, 4:55 PM IST

వరద వదిలినా.. బురద వదలలేదు..!

పెద్దపల్లి జిల్లా మంథనిలో వరద బీభత్సానికి జనజీవనం అతలాకుతలం అయ్యింది. ప్రజలు కట్టుబట్టలతో మిగిలిన పరిస్థితి నెలకొంది. వరద కారణంగా దుబ్బగూడెం, దొంతులవాడ, మంగలివాడ, మర్రివాడ, బర్రెకుంట, శ్రీపాదచౌక్, పాత పెట్రోల్ పంప్ ఏరియా, పాత బస్టాండ్​లో 1,214 ఇళ్లు నీట మునిగాయి. విద్యుత్ పరంగా 220 కేవీ టవర్లు మూడు, 132 కేవీ టవర్లు రెండు, 60 వరకు విద్యుత్ ట్రాన్స్​ఫార్మర్లు, స్తంభాలు నేలకూలాయి. ప్రస్తుతం వరద వీడి నాలుగు రోజులు గడుస్తున్నా.. ప్రజల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీవ్రంగా నష్టపోయారు. తడిసిన పుస్తకాలు, సర్టిఫికెట్లు, సామగ్రి ఎండబెట్టారు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితిని చూడలేదని తెలిపారు.

మంథనిలోని దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో.. సరకులు పూర్తిగా నీటి పాలయ్యాయి. 93 దుకాణాలకు రేషన్ సరఫరా చేసే గోదాంలోకి నీళ్లు రావడంతో భారీ నష్టం వాటిల్లింది. సామగ్రి మునిగిపోవడంతో తిండి కోసం విలవిలలాడే పరిస్థితి నెలకొందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి అధికారులు ఎవరు రాకపోయినా.. పాక్షికంగా కూలిన ఇళ్లకు, పూర్తిగా కూలిపోయిన వాటికి పరిహారం ఇస్తారనే ప్రచారం జరగుతుండటంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి..: నీట మునిగిన తమ పరిస్థితి ఏంటని కొందరు బాధితులు కన్నీరు పెడుతున్నారు. వరదల్లో మునిగిపోయి పనికి రాకుండా పోయిన సామాన్లు తరలించేందుకు ఖర్చు అయ్యిందని బాధితులు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details