న్యాయవాద దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణిల హత్యకు సంబంధించిన విచారణ మరింత లోతుగా జరుగుతోంది. మూడో రోజైన సోమవారం రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్‌పూర్ వ్యవసాయ కమిటీ ఛైర్మన్ పూదరి సత్యనారాయణను విచారణ అధికారులు రోజంతా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. హత్యకు ముందు, తరువాత జరిగిన ఫోన్ కాల్‌డాటాతో పాటు ఆర్థిక లావాదేవీల పైనే పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా మధు కుటుంబీకులు, సన్నిహితులకు సంబంధించిన 32 బ్యాంకు ఖాతాల వివరాల ఆధారంగా విచారణను ముమ్మరంగా సాగిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత జనవరి 1 నుంచి వారం కిందటి వరకు ఆయా ఖాతాల నుంచి జరిగిన నగదు బదిలీ లావాదేవీల వివరాల్ని పోలీసులు విచారణకు ఆయుధంగా మలచుకున్నట్లు తెలిసింది.
అర్ధరాత్రి తరువాత ఇంటికి...
వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదులో పేర్కొన్నట్లు జైల్లో ఉన్న కుంట శ్రీను తన గ్రామంలో భవనాన్ని ఎలా నిర్మిస్తున్నారు..? మీరు ఆర్థికంగా సాయమందించారా..? అని పుట్ట దంపతుల్ని వేర్వేరుగా అడిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో రూ.2 కోట్ల సుపారీపై పోలీసులు భిన్నకోణాల్లో అడిగిన ప్రశ్నలకు విచారణ ఎదుర్కొంటున్న ముగ్గురూ దాదాపు దాటవేత ధోరణిని అవలంబించినట్లు సమాచారం.. ఈ క్రమంలో అధికారులు నిందితులు శైలజ, సత్యనారాయణను మళ్లీ మంగళవారంవిచారణకు హాజరవ్వాలంటూ పంపివేశారు. మధును మాత్రం మూడు రోజులుగా కమిషనరేట్‌లోని ఓ గదిలోనే ఉంచి విచారించిన పోలీసులు సోమవారం అర్ధరాత్రి ఇంటికి పంపించారు. మంగళవారం కూడా విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.