Peddapalli Woman Starts Traditional Bakery Foods : మహిళా పారిశ్రామికవేత్తగా ఎదగాలంటే ఎంతో కృషి చేయాలన్న ఆలోచనకు భిన్నంగా అంకుర సంస్థ ఏర్పాటు చేయవచ్చని నిరూపించింది ఈ యువతి. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉంటూ హైదరాబాద్‌లో ఎంఏ సోషియాలజీ పూర్తి చేసి సివిల్స్ శిక్షణకు దిల్లీ వెళ్లింది. రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాసినా అందులో విఫలం అయింది. అయినా ఏ మాత్రం కుంగిపోకుండా ఉండగా, అదే సమయంలో కరోనా వల్ల ఉద్యోగ సంక్షోభం ఏర్పడటంతో వ్యాపారంపై ఆసక్తి పెంచుకుంది.
అఖిల స్వస్థలం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రంగంపల్లి. ఆమె తల్లి మాధవి కౌన్సిలర్, తండ్రి రైతు. ఆ యువతి తన ఇంట్లోనే ఉంటూ స్వయంగా వంటకాలు తయారు చేయడం నేర్చుకున్నారు. తనను తాను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ కప్ కేక్, బ్రౌనీజ్, డోనాట్స్, మిల్లెంట్ బ్రౌన్స్, రాగి, గోధుమ కేకులతో పాటు ఓట్స్, మిల్లెట్ బ్రౌనీజ్ వంటివి తయారు చేయడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఆ తర్వాత దాదాపు రెండేళ్ల పాటు తన స్నేహితురాలితో కలిసి ఆన్‌లైన్‌లో విక్రయానికి శ్రీకారం చుట్టారు. ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకుంటూ వ్యాపారాన్ని అఖిల మరింత వృద్ధి చేసుకున్నారు.
Woman Startup Business at Pedapalli : ఇప్పటికే పెద్దపల్లిలో అనేక బేకరీలు ఉండగా, ఆ బేకరీలకు భిన్నంగా రుచి, నాణ్యత ఉండాలన్న ఉద్దేశంతో పాటు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరికొత్త ఆహార పదార్థాలు తయారు చేయడానికి అఖిల శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో ప్రజలకు బలవర్ధక ఆహారం అందించాలన్న ఉద్దేశంతో పాటు హైదరాబాద్‌లో లభించే ఆహార ఉత్పత్తులకు దీటుగా ఆ యువతి వాటిని తయారు చేస్తుండటంతో ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది.
"నేను నా కెరియర్‌ను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ప్రారంభించాను. కానీ రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేదు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఫుడ్ డెలివరీ చేయడం ప్రారంభించాము. జస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఒకటి క్రియేట్ చేసుకొని ఫుడ్ సరఫరా చేసేవాళ్లం. నేను ఉండే పెద్దపల్లి ప్రాంతంలో ఈ ఫుడ్ కామన్ కాదు. చాలా రేర్. ఎక్కడైనా దొరికినా అసలు బాగోడం లేదు. అప్పుడు నేను డిసైడ్ అయి క్వాలిటీ, క్వాంటిటీ, టేస్టును ఇచ్చి సంప్రదాయ పద్ధతిలో బేకరీ పదార్థాలను తయారు చేయడం ప్రారంభించాను."- గాదె అఖిల, అంకుర సంస్థ యజమాని