తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్కదారి పడుతున్న అంగన్వాడీ సరకులు.. 'కుళ్లిపోయాక ఇస్తున్నారు'

అంగన్వాడీ నిర్వాహకులు కొన్ని చోట్ల తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన సరుకులను పక్కదారి పట్టిస్తున్నారు. అంతేకాకుండా పోషకాలతో అందజేయాల్సిన గుడ్లను కుళ్లిపోయాక ఇస్తున్నారని రాయదండి గ్రామస్థులు వాపోయారు.

anganwadi goods misuse, peddapalli
అంగన్వాడీ నిర్వాహకురాలిపై ఆరోపణలు, అంగన్వాడీ సరుకులు

By

Published : Jun 23, 2021, 12:46 PM IST

పక్కదారి పడుతున్న అంగన్వాడీ సరుకులు

పిల్లలు, గర్భిణీల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీల్లో కొన్నిచోట్ల నాణ్యత కొరవడుతోంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం రాయదండిలో అంగన్వాడీ సరకులు పక్కదారి పడుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులకు ఇవ్వాల్సిన బియ్యం, పప్పులు అంగన్వాడీ సిబ్బంది అమ్ముకుంటున్నారని తెలిపారు. కోడిగుడ్లు పంపిణీ చేయకుండా దాచిపెట్టడంతో కుళ్లిపోయాయని... వాటినే గర్భిణీలకు ఇస్తున్నారని వాపోయారు.

విచారణ

ఈ విషయంపై సంక్షేమ అధికారికి ఫిర్యాదు చేయగా... విచారణ చేపట్టారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన అధికారులు... రికార్డులు పూర్తిగా తనిఖీ చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా సంక్షేమ అధికారికి, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినట్లు సర్పంచ్ తెలిపారు.

నిల్వ ఉంచి విక్రయం

లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా నిల్వ ఉంచిన 15 సంచుల బియ్యాన్ని అంగన్వాడి కేంద్రం నిర్వాహకురాలు తన ఇంటి వద్ద విక్రయిస్తూ ఉండగా గ్రామస్థులు చరవాణిలో చిత్రీకరించారు. ఒక్కో సంచిని రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.15 వేలకు విక్రయించినట్లు గ్రామస్థులు తెలిపారు.

చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పక్కదారి పట్టడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పంపిణీ చేసే బియ్యం, కోడిగుడ్ల పంపిణీ సక్రమంగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:మట్టిమిద్దె కూలి... సర్పంచ్ లక్ష్మమ్మ, ఆమె మనవడు మృతి

ABOUT THE AUTHOR

...view details