రాష్ట్రంలో మళ్లీ కరోనా విజృంభిస్తున్న వేళ పెద్దపల్లి జిల్లా పోలీసులు ముందు జాగ్రత్తలపై దృష్టి సారించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 55మందిపై కేసు నమోదు చేశారు. వీళ్లంతా కోర్టులో రూ.1000 చొప్పున జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒక్క సుల్తానాబాద్ మండలంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు.. మాస్క్ లేకుండా తిరుగుతున్న దాదాపు 30 మందిపై కేసు నమోదు చేశారు.
ఇకపై హెచ్చరికలు లేవు..
మాస్కులు ధరించలేదని ఇప్పటివరకు అవగాహన, హెచ్చరికలతో సరిపెట్టిన పోలీసులు.. ఇకనుంచి వారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ కేసుల ద్వారా ప్రజల్లోకి సందేశాన్ని తీసుకెళుతున్నామన్నారు. మాస్కు పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కొందరిలో మార్పు రావడం లేదని, ఇలా చేయడం వల్లనైనా మార్పు వస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించారు.