పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్‌లో 60 గేట్లు ఎత్తి అధికారులు వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయగా.. 2,05,400 క్యూసెక్కుల నీరు గలగల ప్రవహిస్తూ పార్వతి బ్యారేజ్ లోకి చేరడం వల్ల జలాశయం జలకళను సంతరించుకున్నది.
పార్వతి బ్యారేజ్‌కు కొనసాగుతున్న వరద.. 60 గేట్లు ఎత్తివేత! - పార్వతీ బ్యారేజికి వరద ప్రవాహం
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ 60 గేట్లు ఎత్తి నిరంతరాయంగా వరద నీటిని దిగువకు వదులుతున్నారు. గత 15 రోజులుగా గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి నుంచి వరద నీటి ప్రవాహం రాష్ట్రాలు దాటి వస్తోంది. గోదావరి నదిపై నిర్మించిన జలాశయాలన్ని నిండుకుండలను తలపిస్తున్నాయి.
పార్వతి బ్యారేజ్ 74 గేట్లలో 60 ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు, ప్రస్తుతం 6.895 టీఎంసిల నీరు నిల్వ ఉంది. వరద ఉధృతిని బట్టి.. అధికారులు నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. బ్యారేజ్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం 130 మీటర్లు కాగా.. ప్రస్తుతం 128.75 మీటర్ల నీటి నిల్వ ఉంది. 2,06,950 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అదే మొత్తంలో ఔట్ ఫ్లో కూడా ఉంది. గత వారం రోజులుగా.. వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు వదిలి పెడుతుండడం వల్ల మంథని వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.