పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా థర్మల్‌తో పాటుగా సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిపై ఎన్టీపీసీ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌పై దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్-నీటిపై తేలియాడే ఉత్పత్తి కేంద్రం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంటులో మే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది.
పెద్దగా భూసేకరణ అవసరం ఉండదు..
దేశవ్యాప్తంగా 450 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ఎన్టీపీసీ నిర్ణయించింది. వీటిలో రిజర్వాయర్లపైనే 217 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణాన్ని తలపెట్టింది. ఇందులో రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉపరితలంపై 100మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతోంది. 450 ఎకరాల విస్తీర్ణంలో 430కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ ఫ్లోటింగ్ ప్లాంటు నిర్మాణం ఇప్పటికే పూర్తి కావల్సి ఉండగా... కొవిడ్ కారణంగా ఆలస్యమైనట్లు సమాచారం. సాధారణంగా ఒక మెగావాట్ ఉత్పత్తికి ఐదెకరాలు అవసరమైతే నీటిపై తేలియాడే ప్లాంట్లకు పెద్దగా భూసేకరణ అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.