2015 వరకు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిధిలో లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని(ఎల్‌ఆర్‌ఎస్) ప్రభుత్వం ప్రారంభించింది. అనంతరం అనివార్య కారణాలతో నిలుపుదల చేసింది. తాజాగా వచ్చే అక్టోబర్ 15 వరకు దరఖాస్తుకు అవకాశమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో బల్దియాల్లోని టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అనుమతి ఉన్న ప్లాట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం సూచించింది.
అక్రమ లే అవుట్లలో ప్లాట్లకు గతంలో రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నప్పటికీ వాటిని మళ్లీ రిజిస్ట్రేషన్(క్రయ, విక్రయాలకు) చేయవద్దని, చట్టబద్ధంగా చెల్లవని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇళ్లు, భవనాలు, ప్లాట్లు, ఇతర నిర్మాణాలేవైనా పురపాలక, పంచాయతీ అనుమతి ఉంటేనే సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయాలని సూచించింది. ఓవైపు ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతులు, మరోవైపు అక్రమ లేఅవుట్లకు రిజిస్ట్రేషన్లు చేయకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నిబంధనలకు లోబడి ఉన్న వాటికే..
భూ గరిష్ఠ పరిమితి చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని క్రమబద్ధీకరించరు. నిషేధిత భూములు, ఎఫ్‌టీఎల్ భూములు, నాలాలకు రెండు మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్న వాటిని, విమానాశ్రయ ప్రాంతాల్లో 500 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉన్నవాటిని ఎల్‌ఆర్‌ఎస్ చేయవద్దని ప్రభుత్వం సూచించింది. రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ శివారు గ్రామాల్లో ఎక్కువగా చెరువులను కబ్జా చేస్తూ చాలా మంది అనధికారికంగా లే అవుట్లు నిర్వహిస్తున్నారు. వీరికి క్రమబద్ధీకరణ వర్తించదు.
బల్దియాలకు పెరగనున్న ఆదాయం
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం 2016 సంవత్సరం వరకు 2,009 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం వీటితో పాటు మూడు రెట్లు అనధికారిక ప్లాట్లు, లే అవుట్లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. ఇక పెద్దపల్లిలో గతంలో 300 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌లుంటే ప్రస్తుతం 1000 వరకు పెరిగే అవకాశాలున్నాయి.