పెద్దపల్లి జిల్లా ముత్తారంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ధర్నాకు దిగాయి. రహదారిపై 2 గంటల పాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పదేళ్లుగా కరెంటు రీడింగ్ తీసుకెళ్లటమే కానీ... ఏ ఒక్క నెలా బిల్లు ఇవ్వకుండా ఒక్కసారే వేలకు వేలు చెల్లించాలనటం అన్యాయమని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కోక్కరికి సుమారు రూ.60 నుంచి 70 వేల బిల్లులు ఇవ్వటం దారుణమని మండిపడ్డారు.
ముత్తారంలో ఉన్న రెండు నుంచి మూడు వందల ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు పదేళ్ల క్రితం జీరో కనెక్షన్ల పేరిట మీటర్లు బిగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్లులనే మాటే లేదు. ఇప్పుడున్న నియమాల ప్రకారం అధికారులు... స్థానికులను అప్రమత్తం చేశారు. బిల్లులు కట్టాలని... లేని పక్షంలో కనెక్షన్లు తీసేస్తామని గడువిచ్చారు. ఈ నెల 3 న గడువు పూర్తి కావటం వల్ల కనెక్షన్లను అధికారులు తొలగించారు.