1995లో పురపాలక సంఘంగా ఏర్పడిన రామగుండంలో మెుదటిసారి 1997లో ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. 2001లో ప్రథమ శ్రేణి, 2010లో ప్రత్యేక శ్రేణి పురపాలక సంఘంగా అభివృద్ధి చెందగా... 2013లో నగరపాలక ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. రామగుండంలో పరిశ్రమలకు అవసరమైన బొగ్గు, నీరుతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా ప్రగతిని సాధిస్తోంది. దశలవారీగా సింగరేణి బొగ్గు గనులతో పాటు థర్మల్ కేంద్రం, ఎరువుల కర్మాగారం, ఎస్టీపీసీ తదితర పరిశ్రమలు రావటంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరిగింది. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాల ఏర్పాటుతో ఈ ప్రాంత జనాభా క్రమంగా పెరుగుతూ వస్తోంది. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
గోదావరి నదీ ఉన్నా తాగే నీరేది..?
రామగుండం ప్రాంతం ఎన్నో పరిశ్రమలకు నిలయంగా ఉన్నప్పటికీ... సమస్యలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి. పాలకవర్గంలో ఎవరున్నా... నిధుల సద్వినియోగంలో విఫలమవుతున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించలేక పోతున్నారని అంటున్నారు. సమీపంలో గోదావరినది, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉన్నప్పటికీ... తాగునీటికి అనేక ఇబ్బందుల పడే పరిస్థితి ఉంది. అమృత్ పథకంలో భాగంగా దాదాపు 2వేల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినా..... అందులోకి నీరు సరఫరా మాత్రం కావడం లేదు. పలుసార్లు పట్టణవాసులు నీటి కోసం రోడ్డెక్కిన పరిస్థితులు కూడా ఉన్నాయి.
రహదారుల విస్తరణ పనులకు మోక్షం ఎప్పుడు..?
రోజురోజుకు రామగుండంలో రద్దీ పెరుగుతున్నప్పటికీ... రహదారుల విస్తరణ పనులకు మోక్షం కలగడంలేదు. పట్టణంలోని అక్కడక్కడ ప్రధాన రోడ్లు దెబ్బతిని అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రామగుండం మున్సిపాలిటీ కార్యాలయం నుంచి ఫైవ్ ఇంక్లైన్ వరకు నిర్మించనున్న రోడ్డు విస్తరణ పనులు ఏళ్లు గడిచినా పూర్తి కావట్లేదు. వర్షకాలంలో వివిధ రోడ్ల పరిస్థితి మరి దారుణంగా ఉంటోంది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు అనేక అవస్థలు పడుతున్నారు. మరోవైపు వీధుల్లో అండర్ డ్రైనేజీ కోసం తవ్విన రోడ్లన్నీ పాడైపోయాయి. పట్టణంలోని ఆయా వార్డుల్లో వీధీదీపాలు లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.