రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం బెదిరింపులకు భయపడి.. రైతులకు అన్యాయం చేయాలని చూస్తోందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్ ఆరోపించారు. తక్షణమే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలసి నిరసన దీక్ష చేపట్టారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రైతులకు మేలు జరిగిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. మహిళ, సహకార సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా ఎంతో మంది రైతులకు లబ్ధి చేకూరేలా చూసిందన్నారు. గ్రామస్థాయిలో రైతుల అభివృద్ధికి పాటు పడిందని పేర్కొన్నారు. తెరాస ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు.