కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులు తాము పండించిన పంటలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితి నెలకొందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. పెద్దపెల్లి జిల్లాలోని గర్రెపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
2014లో తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమం కోసం ప్రతి ఏడాది రూ. వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అందుకే రైతుల శ్రేయస్సు కోసం రైతు వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత చేస్తుంటే కేంద్రం మాత్రం వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చి వారిని అయోమయానికి గురిచేసిందని మండిపడ్డారు.
రైతు పండించిన పంటకు ఎంఎస్పీ ధర కేంద్రమే నిర్ణయిస్తుంది. కొత్త చట్టాలతో ఇప్పుడు ధరని కేంద్రం నిర్ణయించదు. ఈ ప్రభావం భవిష్యత్తులో రైతులపై ఏ విధంగా ఉంటుందో చూడాలి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాలన్నింటినీ రైతులు ఎప్పటికప్పుడు అవగతం చేసుకోవాలి.