పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తిచేసి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులకు సూచించారు. కర్మాగారాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి సందర్శించారు. ఎరువుల కర్మాగారం నిర్మాణ పనులను సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
99 శాతం పనులు పుర్తయ్యాయి..
1985లో మూసివేసిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాలని, ఎన్టీపీసీలో అదనపు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ పోరాటం చేశారని మంత్రి గుర్తు చేశారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేంద్రంలో తన వంతు కృషి చేసి ఫలితం సాధించారని మంత్రి తెలిపారు. రూ.6120.5 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99% పూర్తయ్యాయన్నారు. ఎరువుల కర్మాగారానికి అవసరమైన నీటి సరఫరా ,విద్యుత్ సరఫరా, గ్యాస్ సరఫరా పనులు పూర్తి చేశామన్నారు. ప్రతి రోజు 2200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేస్తామని తెలిపారు. ప్రతి సంవత్సరం 12.5 లక్షల యూరియా ఉత్పత్తి అవుతుందని మంత్రి వివరించారు.