తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. రైతాంగాన్ని సంఘటిత శక్తిగా మార్చాలన్న లక్ష్యంతోనే రైతు వేదికల నిర్మాణం చేపట్టామని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి, కుక్కలగూడుర్‌లో రైతు వేదిక భవనాలను కొప్పుల, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌లు కలసి ప్రారంభించారు.
దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఆరేళ్లలో చేసి చూపించిన ఘనత కేసీఆర్‌దేనని తెలిపారు. 60 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగం బాగుంటే.. ఈ సమాజం అంతా బాగుంటుందన్నారు. రైతులు తాము పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకోవాలంటే.. రైతులు సంఘటితం కావాలన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు.