Manufacture of Tiles from Plastic Waste :కరోనా తన ఉద్యోగాన్ని కొల్లగొడితే.. బాధపడుతూ ఇంట్లో కూర్చోలేదు ఈ యువకుడు. వినూత్నంగా ఆలోచించి ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ పరిశ్రమను నెలకొల్పి.. వ్యాపారవేత్తగా ఎదిగాడు. ప్లాస్టిక్ పునర్వినియోగం చేయాలని అనడమే తప్ప.. ఆచరణలో పెద్దగా కనిపించకపోవడంతో తనకి ఆలోచన వచ్చిందంటున్నాడు ఈ యువకుడు. ప్లాస్టిక్ వ్యర్థాలతో టైల్స్ తయారీ చేస్తున్న ఈ యువకుడి పేరు జూపల్లి సాయికిరణ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం బొంతకుంటపల్లి ఇతడి స్వస్థలం.
ఇంజినీర్ ఉద్యోగం చేస్తున్న సాయికిరణ్ కొవిడ్ కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. దానికి అధైర్యపడని యువకుడు.. టైల్స్ వ్యాపారం ప్రారంభించి ముందుకు సాగుతున్నాడు. కాగా పరిశ్రమ స్థాపనకు గల కారణాలను ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. తొలుత గాజు వ్యర్థాలతో టైల్స్ తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి లాభనష్టాలను బేరీజు వేసుకున్నాడు. మార్కెట్‌లోని సాధారణ టైల్స్ ధరతో.. గాజుతో తయారు చేయాలనుకున్న టైల్స్ వ్యయాన్ని అంచనా వేసుకున్నాడు.
Plastic Tiles Manufacture : మరోసారి ఆలోచించి ప్లాస్టిక్ వ్యర్థాల వైపు మొగ్గు చూపినట్లు సాయికిరణ్ చెబుతున్నాడు. తాను తయారు చేసే టైల్స్‌కు మిగతా టైల్స్‌కు గల తేడాను ఇలా వివరిస్తున్నాడు. మొదట్లో ముడిసరుకు కోసం కొంత ఇబ్బంది అయినప్పటికి.. ప్రస్తుతం మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు స్వయంగా తన యునిట్ వద్దకే ప్లాస్టిక్ వ్యర్థాల్ని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమను పరిశీలించిన పలువురు అధికారులు సైతం ప్రశంసించారని యువకుడు తెలిపాడు.
సాయికిరణ్ రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగకుండా బంధువులతో కలిసి పెట్టుబడి పెట్టాడు. కాగా టైల్స్ తయారీ ఎలా సాగుతోందో వివరిస్తున్నాడు సాయికిరణ్. తమ ఉత్పత్తులు 50 ఏళ్ల పాటు మన్నికగా ఉంటాయని చెబుతున్నాడు. తన ప్రయత్నాన్ని అధికారులు అభినందించడమే కాక మరిన్ని చోట్ల ఆచరణ జరిగేలా కృషి చేస్తుండటం సంతోషాన్నిస్తుందని అంటున్నాడు. పర్యావరణహితానికి తనవంతు బాధ్యతతోనే ఈ సంస్థ నెలకొల్పానని అంటున్నాడు యువ వ్యాపారి.