పెద్దపల్లి జిల్లా రాయదండి రైతు కుటుంబానికి చెందిన పల్లెరాజు మాస్టర్స్ డిగ్రీ, శ్యాంసుందర్ బీటెక్, సతీశ్ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ... ఉద్యోగాల కోసం వేచిచూడకుండా వ్యవసాయ అనుబంధ రంగంవైపు దృష్టి సారించారు. చిన్ననాటి నుంచి వ్యవసాయ అనుబంధ రంగాలంటే ముగ్గురికి ఆసక్తి. ముఖ్యంగా పెద్దగా పెట్టుబడి లేకుండా వ్యవసాయ అనుబంధ రంగమైన కోళ్ల పెంపకం ప్రారంభించారు.
రూపకల్పన..
ఇప్పటికే బ్రాయిలర్ కోళ్ల పరిశ్రమలు కొనసాగుతుండగా... దేశీయ కోళ్లకు మంచి గిరాకీ ఉంటుందన్న ఉద్దేశంతో దేశీయ కోళ్లతో పాటు కడక్‌నాథ్ కోళ్లు, గిరిరాజ కోళ్లను పెంచుతున్నారు. చిన్నచిన్న రైతులు కోడిగుడ్లను పొదిగే యంత్రాలు కొనుగోలు చేయాలంటే కనీసం లక్షన్నర రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిని గమనించిన ముగ్గురు సోదరులు.. వేలకోడిగుడ్లను పొదిగే యంత్రం కాకుండా 100నుంచి 1,000 గుడ్ల వరకు పొదిగే యంత్ర రూపకల్పనకు శ్రీకారం చుట్టారు.
రైతుకు ప్రయోజనం..
ఈ యంత్ర రూపకల్పనలో 10 నుంచి 12సార్లు విఫలమైనా... చివరికి విజయం సాధించారు. భారీ పెట్టుబడులు కాకుండా మహిళా సంఘాలు, సన్నచిన్నకారు రైతులు తమ ఇళ్లలోనే కోడిగుడ్లను పొదిగే విధంగా ఇంక్యుబేటర్‌ను రూపొందించినట్లు తెలిపారు. సాధారణంగా గుడ్లను పొదిగి పిల్లలను ఉత్పత్తి అయ్యేందుకు సుమారు 21రోజుల సమయం పడుతుంది. అయితే ఇంక్యుబేటర్‌లోనూ.. అంతే సమయం తీసుకున్నా.. రైతుకు మాత్రం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు ముగ్గురు సోదరులు.