వామన్‌రావు దంపతులకు సకాలంలో వైద్యం అందలేదా? 108 వాహన సిబ్బంది ప్రాథమిక చికిత్స కూడా చేయలేదా? ఈ అనుమానాలనే శనివారం ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన హైకోర్టు న్యాయవాదుల ఐకాస వ్యక్తంచేసింది. ఈ నెల 17న కల్వచర్ల సమీపంలోని నిందితులు వామన్‌రావు దంపతులను రోడ్డుపైనే నరికి, కొన ఊపిరితో ఉండగానే కారులో పారిపోయిన సంగతి తెలిసిందే. హత్య జరిగిన ప్రాంతాన్ని శనివారం హైకోర్టు న్యాయవాదుల ఐకాస పరిశీలించింది. అనంతరం గుంజపడుగుకు వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఐకాస ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పలు సందేహాలు వ్యక్తంచేశారు. ‘మధ్యాహ్నం 2.30కి దాడి జరిగితే 2.45కి 108 వాహనం వచ్చింది. అక్కడి నుంచి పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి మధ్యాహ్నం 3.20కి చేరుకుంది. ఈ మధ్యకాలంలోనే రక్తస్రావం ఎక్కువగా జరగడంతో బాధితులకు పల్స్‌రేటు పడిపోయినట్టు పోలీసులకు తెలిపామని వారికి చికిత్స అందించిన వైద్యులు చెబుతున్నారు. వారు చికిత్సకు స్పందించలేదని, కొద్దిసేపటికే మృతి చెందారనీ వారు వెల్లడించారు. ఇదే విషయాన్ని ఐజీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనూ పేర్కొన్నారు. దీన్నిబట్టి 108 సిబ్బంది మార్గమధ్యలో రక్తస్రావాన్ని ఆపే ఎలాంటి ప్రయత్నం చేయలేదనేది స్పష్టమవుతోంది.
15 కి.మీ దూరం..గంట ప్రయాణమా?
హత్య జరిగిన సమయంలో స్థానికులు తీసిన వీడియోలో ‘అంబులెన్స్ ఫొటో పంపించాను’ అంటూ ఓ వ్యక్తి మాట్లాడటం విన్పించింది. ‘మీది ఏ ఊరు? ఎవరు చంపారు? ఎవరిమీదైనా అనుమానం ఉందా?’ అంటూ వామన్‌రావును పదేపదే కొందరు ప్రశ్నించడమూ అందులో ఉంది. కుంట శీను, బిట్టు శీను అనుచరులే ఇదంతా చేశారని అనుమానిస్తున్నాం. ఘటనా స్థలానికి, పెద్దపల్లి జిల్లా అసుపత్రికి మధ్య గరిష్ఠంగా 15 కి.మీ దూరం ఉంటుంది. అక్కడికి చేరడానికి గంట సమయం ఎందుకు పట్టింది? వాహనాన్ని మధ్యలో ఎవరైనా ఆపారా? అనే అనుమానమూ ఉంది’ అని వారు పేర్కొన్నారు. నిందితుల అనుచరులే ఘటనా స్థలంలో (సీన్ ఆఫ్ అఫెన్స్)లో సాక్ష్యాలను చెరిపేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. వీటిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.