పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇటీవల సంచలనం సృష్టించిన ఇటుక బట్టీల యజమాని సిద్దయ్య కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. పట్టణంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్న నల్లూరు సిద్దయ్య గౌరెడ్డిపేటలో ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. గత నెల 25న అర్ధరాత్రి సిద్దయ్యను కొందరు వ్యక్తులు ముసుగులు ధరించి అపహరించారు. అనంతరం వ్యాపారి సిద్దయ్య భార్యకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తేనే తన భర్తను వదిలేస్తామని తెలిపారు. భయపడిన సిద్దయ్య భార్య కిడ్నాపర్లకు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వగా... రెండు ఏటీఎం కార్డులు లాక్కొని పరారయ్యారు.
సీసీటీవీ ఫుటేజితో బయటపడ్డ దొంగల బాగోతం
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు వారం రోజుల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు పెద్దపెల్లి పోలీస్ స్టేషన్లో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నిందితుల వివరాలను వెల్లడించారు. వ్యాపారి సిద్దయ్య వద్ద డబ్బులు తీసుకొని పరారైన దుండగులు వివిధ జిల్లాల్లో ఏటీఎం కార్డులను వినియోగించినట్లు తెలిపారు. వీటి ఆధారంగా సీసీ ఫుటేజీ సాయంతో దొంగలను పట్టుకున్నట్లు స్పష్టం చేశారు.