CM KCR Fires on MODI: తెలంగాణ ఏర్పడ్డాక కలలో కూడా ఊహించని అనేక కార్యక్రమాలు నిర్వహించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో తెరాస బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్... పెద్దపల్లిలో ఉద్యమ సమయంలో అనేకసార్లు జెండా ఎగురవేశానని గుర్తు చేసుకున్నారు. సింగరేణిలో వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపారు. సింగరేణి కార్మికులకు భారీగా బోనస్ అందజేస్తున్నామన్నారు. పెద్దపల్లిలో మున్సిపాలిటీలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇదే సందర్భంగా మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
''ఇటీవల జాతీయ రైతు నాయకులు నన్ను కలిశారు. జాతీయ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. గుజరాత్ మోడల్ అని చెప్పి దేశ ప్రజలను దగా చేస్తున్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అడ్డగోలుగా పెంచారు. రూ.లక్షల కోట్ల మేర కుంభకోణాలు చేస్తున్నారు. మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారింది. కల్తీ మద్యంతో 70 మంది మృతికి కేంద్రం జవాబు చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ హయాంలో దోపిడీ తప్ప మరొకటి లేదు. 60 ఏళ్లు కొట్లాడి తెలంగాణ ఆత్మగౌరవం సాధించాం. దేశ ఆర్థిక విలువ దిగజార్చి.. రూపాయి విలువ పతనం చేశారు. మోసపోతే గోసపడుతాం..'' -కేసీఆర్, ముఖ్యమంత్రి
CM KCR Fires on BJP భాజపాను పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందన్న కేసీఆర్... గోల్‌మాల్ ప్రధాని చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. దేశంలోని రైతులు సాగుకు వాడే విద్యుత్ 20.8 శాతమేనని తెలిపారు. దేశంలో సాగుకు వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని వెల్లడించారు. కార్పొరేట్ దొంగలకు దోచి పెట్టినంత సొమ్ము కాదని విమర్శించారు. మోటార్లకు మీటర్లు పెట్టాలన్న మోదీకే మీటర్ పెట్టాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.