తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వరం వెట్​రన్​ విజయవంతం... కేసీఆర్​ హర్షం - project

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కీలక ఘట్టం ఆవిష్కృతమయింది. ఆరో ప్యాకేజీలోని పంపుల పరీక్ష విజయవంతమయింది. సర్జ్‌పూల్‌లో చేరిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోసి పరీక్షించారు. మొదటి పంపు పూర్తి పరిశీలన తర్వాత మిగతా వాటిని కూడా రన్‌ చేయనున్నారు. వెట్​రన్ విజయవంతంపై ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం వెట్​రన్​ విజయవంతం... కేసీఆర్​ హర్షం

By

Published : Apr 24, 2019, 3:31 PM IST

కాళేశ్వరం ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతం కావడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ కృషిలో పాలుపంచుకున్న ఇంజినీర్లు, టెక్నీషియన్లు, వర్కర్లకు శుభాకాంక్షలు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.

తెలంగాణ వరప్రదాయినిగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి జలాశయం మధ్యమానేరు మార్గంలో ఉన్న ఆరో ప్యాకేజీలోని పంపుల వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. వెట్‌రన్‌కు ముందు సీఎంఓ కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి పూజలు చేశారు. అనంతరం సర్జ్‌పూల్‌లోని నీటిని పంపు ద్వారా ఎత్తిపోశారు. తొలిపంప్‌ నుంచి కాళేశ్వర గంగ పరుగులు పెట్టింది.

కాళేశ్వరం వెట్​రన్​ విజయవంతం... కేసీఆర్​ హర్షం

ఉరకలెత్తిన గోదావరి...

కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం ఈ వర్షాకాలానికే ఫలాలను రైతులకు అందించాలన్న లక్ష్యంతో ఉంది. అందుకు అనుగుణంగా పనులను వేగవంతం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలు, పంప్‌హౌజ్‌ పనులు తుది దశలో ఉండగా... రెండో లింక్‌లో సిద్ధమైన పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి వాటిని విజయవంతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అందులోభాగంగా మొదటి పంప్‌ నుంచి గోదావరి ఉరకలెత్తింది.

వెట్‌రన్‌ నిర్వహించేందుకు ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను సర్జ్‌పూల్‌లోకి తరలించారు. సర్జ్‌పూల్‌లో నీటిమట్టాన్ని 142.3 మీటర్లకు చేర్చారు. ఇక్కడ మొత్తం ఏడు డ్రాఫ్ట్ ట్యూబ్ గేట్లు ఉన్నాయి. వాటన్నింటినీ పూర్తి స్థాయిలో పరీక్షించి ఎలాంటి లీకేజీలు లేవని గజఈతగాళ్లతోనూ నిర్ధారించుకున్నారు. గతంలోనే పంపు డ్రైరన్‌ పూర్తి కాగా.... తాజాగా నీటిని ఎత్తిపోసి పంపుల వెట్‌రన్‌ చేపట్టారు.

విజయవంతమైన వెట్​రన్...

మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో మొదటి పంపు మోటార్‌ను ప్రారంభించారు. ఇంజినీర్లు నిర్దేశిత ప్రొటోకాల్ ప్రకారం అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరీక్షించి నమోదు చేస్తారు. మొదటి పంపు పరీక్ష పూర్తి స్థాయిలో విజయవంతమైన అనంతరం మిగతా పంపులను దశల వారీగా పరీక్షిస్తారు. ఇక్కడి పంపుల సామర్థ్యం 126 మెగావాట్లు. ఒక్కో పంపు 3200 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది.

ఏడు పంపులకు గాను నాలుగు పంపులు వెట్‌రన్‌కు సిద్దమయ్యాయి. మొదటి పంప్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇంజినీర్లు సంబురాలు జరుపుకున్నారు. మిగతా మూడు పంపులను మే నెలాఖరు వరకు సిద్ధం చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details