పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అక్రోజు.రమేశ్, శేఖర్ అన్నదమ్ములు. వీరిద్దరూ గోల్డ్ స్మిత్ పని చేస్తుంటారు. ఇటీవల రమేశ్ శరీరంలో ప్రత్యేక మార్పులు జరిగాయి. బంగారు ఆభరణాల దుకాణం నిర్వహించే రమేశ్‌కు... వారం రోజుల కిందట ఓ వింతైన అనుభవం ఎదురైంది.
ఒకరోజు భోజనం చేస్తుండగా తన కుమారుడు యూట్యూబ్‌లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని... సరదాగా ఓ గిన్నెను తీసుకువచ్చి శరీరంపై పెడితే అతుక్కుపోయిందని రమేశ్ తెలిపారు. మరికొన్ని ఇనుము, స్టీలు సామగ్రిని తన శరీరంపై ఉంచి చూసుకోగా... అవి విడిపోకుండా, కిందపడకుండా అలాగే ఉండిపోయాయని పేర్కొన్నారు. తను కదిలినా, గంతులేసినా జారిపోలేదని వివరించారు.
గతంలో నాకెప్పుడూ ఇలా జరగలేదు. ప్రస్తుతం నా శరీరంలో ఏదైనా మార్పులు జరిగాయేమో..! భగవంతుని అనుగ్రహమో, లేక నా శరీరంలో ఏదైనా మార్పు జరిగి ఉండవచ్చు.
- రమేశ్, వస్తువులు ఆకర్షిస్తున్న వ్యక్తి
ముత్తారం వైద్యాధికారి, పోలీసులు కలిసి రమేశ్‌కు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ స్టీలు సామాగ్రి అతుక్కుపోవడంతో... రమేశ్ శరీరంపై పౌడర్ చల్లి మరొకసారి స్టీలు వస్తువులను అతికించడానికి ప్రయత్నం చేశారు. పౌడరు చల్లిన తర్వాత వస్తువులు కిందికి జారి పడిపోయాయి.