న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే అరెస్టయిన నిందితులు కుంట శ్రీనివాస్ (ఏ1), చిరంజీవి (ఏ2), అక్కపాక కుమార్ (ఏ3)లను పోలీసులు విచారిస్తున్న క్రమంలో మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వామన్‌రావు స్వగ్రామంలో నెలకొన్న ఆలయ, భూ తగాదాలే దంపతుల హత్యకు ప్రధాన కారణమని ఐజీ నాగిరెడ్డి పేర్కొన్నారు. అయితే పాతకక్షలేమీ లేవని, రాజకీయ ప్రమేయంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని వామన్‌రావు తండ్రి ఆరోపిస్తున్నారు. హత్య చేసేందుకు కారు, కత్తులు, డ్రైవర్‌ను సమకూర్చిన ఆరోపణలపై జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ మేనల్లుడైన బిట్టు శ్రీనును పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకొన్నారు.
బిట్టు.. మధ్యాహ్నం వరకు బయటే
బిట్టు శ్రీనును మంథని పోలీస్‌స్టేషన్‌లో సీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. నిందితులకు కారు, కత్తులు ఎందుకిచ్చారు? ఎవరైనా హత్య చేయాలని చెప్పారా? సుపారీ ఇచ్చారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి మంథనిలోనే తిరిగిన అతడిని మధ్యాహ్నం అదుపులోకి తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. 2013 వరకు బిట్టు శ్రీనుపై రౌడీషీట్ ఉండగా ఆ తర్వాత ఎత్తివేశారు. అతడిపై పలు భూ తగాదా కేసులున్నట్లు సమాచారం.
పుట్ట మధుపై కేసులో బెదిరించారు..
మంథనిలో రౌడీయిజం చెలాయిస్తున్న కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీనులను పోలీసులు విచారిస్తుండటంతో వారి బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. మాజీ వార్డు సభ్యుడు ఇనుముల సతీష్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ 2018లో పుట్ట మధూకర్ (ప్రస్తుత జడ్పీ ఛైర్మన్) ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన అక్రమాస్తులపై హైకోర్టులో తాను కేసు వేయగా.. వామన్‌రావు, ఆయన భార్య నాగమణి వాదించారని తెలిపారు. ఆ కేసు వెనక్కి తీసుకోవాలంటూ కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీనివాస్ బెదిరించారని, తాను ఒప్పుకోకపోవడంతో తనను హత్య చేసేందుకు సుపారీ మాట్లాడాడని సతీశ్ ఆరోపించారు. కుంట శ్రీనివాస్ మాటలతో ఆడియో అప్పట్లోనే బయటకు రాగా అప్పటి డీజీపీ, రామగుండం పోలీస్ కమిషనర్‌కు అందించి ఫిర్యాదు చేశానని చెప్పారు. కాని ఇప్పటివరకు దానిని తేల్చలేదన్నారు. తనతో పాటు నలుగురు వ్యక్తులను కుంట శ్రీను, బిట్టు శ్రీను లక్ష్యంగా చేసుకున్నారని, చివరకు వామన్‌రావును హత్య చేశారని చెప్పారు. మిగిలిన ఇద్దరిలో ఒకరిపై పోలీసులతో పీడీ యాక్టును నమోదు చేయించగా మరొకరిని లొంగదీసుకుని పార్టీలో చేర్చుకున్నారని చెప్పారు. తనకు ప్రాణహాని ఉందని సతీశ్ ఆందోళన వ్యక్తంచేశారు.
మూడు రోజులముందే ప్రణాళిక?
వామన్‌రావు దంపతుల హత్యకు మూడు రోజుల ముందుగానే ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిట్టు శ్రీనుతో కుంట శ్రీను 25 సార్లు మాట్లాడినట్లు సమాచారం. ఈ కేసులో వ్యక్తిగత కక్షలే ఉన్నాయా? ఇంకేమైనా కారణాలున్నాయా? అనేది తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కక్షలే అయితే జడ్పీ ఛైర్మన్ మేనల్లుడు వారికి కారు, డ్రైవరుతో పాటు కత్తులను ఎందుకు సమకూర్చాడు? అనేది తేలాల్సి ఉంది. ఈ హత్యోదంతంపై జడ్పీ ఛైర్మన్ పుట్ట మధూకర్ ఇప్పటివరకు స్పందించలేదు. తన మేనల్లుడి విషయంలోనూ ఆయన మాట్లాడకపోవడం గమనార్హం.