తెలంగాణ

telangana

ETV Bharat / state

కత్తులు తిప్పిన చేతులతో ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు.. - కరోనా ఎఫెక్ట్​

ఇరవై మూడు కత్తులను అలవోకగా గొంతులకు దించుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించిన ఆ కళాకారుడిని కరోనా కోలుకోలేని దెబ్బ తీసింది. తన కళను నమ్ముకుని విదేశాల్లో జీవనోపాధి పొందుతున్న ఒక కళాకారుడి స్థితిని ఇడ్లీలు అమ్ముకునే స్థాయికి దిగజార్చి కరోనా వైరస్ కోరలకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంది. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామానికి చెందిన ఆవుల కిషన్ అలియాస్ కత్తుల కిషన్ దీన స్థితిపై ప్రత్యేక కథనం.

guinnese world record winner selling dosa and idly on road due to corona effect
కత్తులు తిప్పిన చేతులతో ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు..

By

Published : Jul 30, 2020, 5:19 PM IST

కత్తులు తిప్పిన చేతులతో ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు..

పెద్దపెల్లి జిల్లాలోని చిన్నకల్వల గ్రామానికి చెందిన ఆవుల కిషన్ చిన్నతనం నుంచే కళాకారుడి వృత్తిలో ఒదిగిపోయాడు. కుటుంబ పోషణకు ఈ వృత్తి చేదోడువాదోడు కావడం వల్ల పూర్తిగా ఈ వృత్తిపైన జీవనం సాగిస్తూ అందులోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇక తన ఆలోచనలకు పదును పెట్టిన ఆవుల కిషన్ కత్తులు మింగడంలో నైపుణ్యం సాధించాడు. ఆవుల కిషన్ కేవలం కత్తులను మింగడమే కాదు కత్తులతో విన్యాసాలు, కనురెప్పలతో కుర్చీని లేపడం, కర్ర మొనపై బొంగరం తిప్పడం వంటి విన్యాసాలు చేసి దేశవిదేశాల ప్రజల మనస్సులను ఆకట్టుకున్నాడు.

23 కత్తులు మింగాడు..

ఇలా వచ్చిన అవార్డులు.. రివార్డులతో కుటుంబ పోషణ సాగిస్తూనే... దేశవిదేశాల్లో పలు ప్రదర్శనలు నిర్వహించి 2011లో ఆస్ట్రేలియాకి చెందిన ఓ కళాకారుడితో పోటీపడి 21 కత్తులు మింగి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో మొదటిసారి స్థానం సాధించాడు. తర్వాత 2012లో ఇటలీకి చెందిన మరో కళాకారుడు ఇరవై రెండు కత్తులు మింగి తన స్థానాన్ని కైవసం చేసుకోగా అందులోనూ పోటీపడి మరోమారు 23 కత్తుల మింగి తన స్థానాన్ని దక్కించుకున్నాడు ఆవుల కిషన్. దీంతో అప్పటి నుంచి పెద్దపెల్లి జిల్లాకు కత్తుల కిషన్​గా సుపరిచితుడు అయ్యాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో స్థానం సాధించిన తనకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి సహకారం లేకపోవడం వల్ల జీవనోపాధి కోసం విదేశాల్లోనే కళాకారుడిగా స్థిరపడ్డాడు.

కత్తులు తిప్పిన చేతితోనే..

ఈ నేపథ్యంలో గత కొన్ని ఏళ్లుగా దుబాయిలో పలు సంస్థలు ఇచ్చే అరకొర వేతనంతో కళాకారుడిగా తన జీవితాన్ని నెట్టుకొస్తున్న తరుణంలో కరోనా కోలుకోలేని దెబ్బతీసింది. కరోనా కోరలు విసరడం వల్ల దుబాయ్ నుంచి తనను అర్ధాంతరంగా స్వదేశానికి పంపించినట్లు కత్తుల కిషన్ వాపోయాడు. దీంతో ఇక్కడికి వచ్చిన కత్తుల కిషన్ కళాకారుడి వృత్తికి ప్రోత్సాహం లేకపోవడంతో తన గ్రామ సమీపంలోనే రహదారి పక్కన ఇడ్లీ బండి వ్యాపారం చేపట్టాడు. ఇలా చేసిన వ్యాపారంతో భార్యను పోషించడంతో పాటు తమ కుమార్తెలకు చేసిన వివాహానికి అయిన అప్పులను తీర్చడం కోసం ఇబ్బంది పడుతున్నట్లు కిషన్ వెల్లడించాడు. తనలాంటి కళాకారుడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చేయూతనివ్వాలని కత్తుల కిషన్ వేడుకుంటున్నాడు.

ఇవీ చూడండి:'గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే!'

ABOUT THE AUTHOR

...view details