కాలగమనంలో అంతరించిపోయిన వన్యప్రాణులు మళ్లీ ఇప్పుడిప్పుడే అడవితల్లి ఒడిలో సేద తీరేందుకు తరలివస్తున్నాయి. కొన్ని దశాబ్దాల తర్వాత జిల్లాలో పెద్దపులులు, చిరుతల అలజడులు కనిపిస్తున్నాయి. అటవీ జంతువుల సంరక్షణ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి రెండేళ్లకొకసారి వన్యప్రాణుల గణన సర్వేలను అటవీ శాఖ అధికారులు చేపడుతున్నారు. 2018 సంవత్సరంలో ఎకలాజికల్ యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఈ సంవత్సరం మళ్లీ నిర్వహించాల్సి ఉంది. కరోనా మహమ్మారి విజృంభణతో ఈ జనగణన సర్వే వాయిదా పడింది. గత రెండేళ్లలో గణనీయంగా జిల్లాలో వన్యప్రాణుల సంఖ్య 10 శాతం పెరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాలో వెల్లడించారు. మరోవైపు అటవీ సంపద 12 శాతం నుంచి ఏకంగా 14.80కు పెరగడం వల్ల పర్యావరణ సమతుల్యత సుసంపన్నం అవుతుందని అధికారులు చెబుతున్నారు.
పెరిగిన శాకాహార, మాంసాహార వన్యప్రాణులు
అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల గుర్తింపు వివరాలను క్షేత్రస్థాయిలో సేకరించి ‘ఎకలాజికల్’ యాప్‌లో నమోదు చేస్తారు. గణన సమయంలో తీసిన చిత్రాలు, ఇతర ఆనవాళ్ల వివరాలను విధిగా ఇందులో క్రోడీకరిస్తారు. ఈ గణన ఆధారంగానే వన్యప్రాణుల సంరక్షణ చేపడతారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం 14.80 శాతం ఉంది. మంథని, రామగిరి, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండగా మిగితా మండలాల్లో తక్కువగా ఉంది. గత 25 రోజులుగా ములుగు అభయారణ్యం నుంచి పెద్దపులి ఈ మండలాల్లో ఎక్కువగా సంచరించింది. ముత్తారం భగుళ్లగుట్ట వద్ద ఆవును, కమాన్‌పూర్, సబ్బితం ప్రాంతాల్లో అడవి పందులను వేటాడి తింటూ ఆవాసం కోసం సంచరిస్తుంది. రెండేళ్ల క్రితం చిరుతలు 2 మాత్రమే ఉండగా ప్రస్తుతం 5 చిరుతలున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ జంతువుల సంతతి 10 శాతం గణనీయంగా పెరిగితే అడవి పందుల సంతతి 20 శాతం వరకు పెరిగింది. గతంలో మొత్తం 9,910 వన్యప్రాణులుంటే ఇప్పటివరకు 11,287 కు పెరిగి సుమారు 1,377 వన్యప్రాణులు పెరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. మరోవైపు ప్రభుత్వం వానర వనాలు, ప్రకృతి వనాల పేరిట ప్రత్యేకంగా వృక్షజాతులను పెంచుతుండటంతో కోతులు, కుందేళ్లు, జింకలు, నెమళ్లు, కొండగొర్రెల సంఖ్య పెరుగుతున్నాయి.
నిఘా ముమ్మరం.. సంరక్షణే ధ్యేయం
కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో భూగర్భజలాలు పెరిగాయి. భారీ వర్షాలతో ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, పాలకుర్తి వంటి నీటి ఎద్దడి మండలాల్లో సైతం 20 మీటర్ల లోతులో భూగర్భజలాలు నిండు కుండలా తొణికిసలాడుతున్నాయి. హరితహారం కింద పర్వత శ్రేణుల్లో విత్తన బంతులను వెదజల్లడం, ఖాళీ స్థలాల్లో పండ్ల, పూల, ఔషధ మొక్కల పెంపకంతో పచ్చదనం విస్తరించడమే కాకుండా సంరక్షించేందుకు ఉపక్రమించింది. 2019 సంవత్సరంలో 25 లక్షలు నాటాల్సి ఉండగా 13 లక్షలు, 2020లో ఇప్పటివరకు 5.38 లక్షలు నాటాల్సి ఉండగా 5.55 లక్షల మొక్కలను నాటారు. జిల్లాలో చెన్నూరు- మంథని సరిహద్దులో ఎల్-మడుగు అభయారణ్య ప్రాంతం మొసళ్ల సంరక్షణ కేంద్రం, పెద్దపల్లి, మంథనిలలో 14 సెక్షన్లు, 40 బీట్ల పరిధిలో అటవీ, పోలీసు శాఖల పూర్తి సహకారంతోనే అటవీ సంపద పరిరక్షణను నిరంతరం చేపడుతున్నారు. ప్రత్యేకంగా పోలీసు నిఘా వర్గాలు కూడా దృష్టి సారిస్తుండటంతో కలప దొంగతనం, వన్యప్రాణుల వధ, తరలింపు వంటివి అదుపులోకి వచ్చాయి.