ఉన్నత విద్యను అభ్యసించిన్పటికీ కొలువులు దొరకపోవటం వల్ల కుల వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారు పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లోని కొందరు పట్టభద్రులు. తెలంగాణ ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించే మల్లిఖార్జున స్వామి పట్నాలు, పెళ్లిలో పూజారులుగా అవతారమెత్తారు. మౌస్ పట్టుకోవాల్సిన చేతిలో డమరుకాన్ని పట్టుకుని మల్లన్న కథ ఆలపిస్తూ పొట్ట నింపుకుంటున్నారు.
కొలువులు రాక కొలుపు చెబుతున్న పట్టభద్రులు - మల్లిఖార్జున స్వామి పట్నాలు
డిగ్రీ పట్టాలు అందుకున్న చేతులతోనే డమరుకాన్ని పట్టుకున్నారు. పుస్తకాలను నమిలి మింగేసిన నోటితోనే... మల్లన్న కథ ఆలపిస్తున్నారు. సూటూ బూటు వేసుకోవాలని ఆరాటపడిన ఆ యువకులు మళ్లీ దోతుల్లోకి మారారు. ఎప్పుడెప్పుడు కొలువులొస్తాయా అని ఎదురుచూసి అలసిన ఆ పట్టభద్రులు... కులవృత్తితోనే పొట్టపోసుకుంటున్నారు.

డిసెంబర్ ద్వితీయార్థంలో ప్రారంభమై శివరాత్రి వరకు కొనసాగే సట్టువారాల్లో గొల్ల, కురుమలు మల్లన్న పట్నాలు, పెళ్లి, బోనాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల తంతును ఒగ్గు పూజారులు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం సట్టువారాల్లో బోనం సమర్పించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి కూడా మల్లన్న భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేస్తుంటారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... పట్టభద్రులైన ఒగ్గు కళాకారులు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. డిగ్రీ పట్టాలు పొందినా... ఉపాధి దొరకపోవటం వల్ల చివరికి కుల వృత్తినే నమ్ముకున్నారు. అంతరించిపోతున్న తెలంగాణ కళా వైభవాన్ని... తమ కుల వృత్తిని కాపాడటం కూడా ఒకింత సంతోషమేనని... వారు చెబుతున్నారు. చదివిన చదువులకు కొలువులు దొరకనందుకు అసంతృప్తి ఉన్నా... కన్నతల్లిలా కుతవృత్తులే తమ కడుపు నింపుతున్నాయని సర్దిచెప్పుకుంటున్నారు.