తెలంగాణ

telangana

ETV Bharat / state

అందరికీ ఆదర్శం: వంద రోజుల్లో 105 ధ్రువపత్రాలు - తెలంగాణ వార్తలు

అంతర్జాలం అందుబాటులో ఉంటే చాలు.. ఎంత సమయమైనా క్షణాల్లో గడిచిపోతుంది. ఎంతో మంది ఇలా సమయాన్ని వృథా చేస్తున్నారు. కానీ పెద్దపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మాత్రం కరోనా వేళ విరామ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. కేవలం 100రోజుల్లో 105 ధ్రువపత్రాలు పొంది చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.

government-teacher-ram-chandra-reddy-got-105-certificates-during-lockdown-time-in-100-days-in-peddapalli-district
అందరికీ ఆదర్శం: వంద రోజుల్లో 105 ధ్రువపత్రాలు

By

Published : Jan 25, 2021, 1:39 PM IST

అందరికీ ఆదర్శం: వంద రోజుల్లో 105 ధ్రువపత్రాలు

లాక్‌డౌన్‌లో జాతీయ, అంతర్జాతీయ వెబి‌‌నార్లతో పాటు క్విజ్‌పోటీలు, ఆన్‌లైన్ కోర్సుల్లో పాల్గొని ప్రత్యేక గుర్తింపు పొందారు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన కోల రాంచంద్రారెడ్డి. గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తించే రాంచంద్రారెడ్డి లాక్‌డౌన్‌ను అదనపు అర్హతలు సాధించేందుకు వినియోగించుకున్నారు.

పెద్దపల్లి జిల్లా ముస్త్యాల ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా కోల రాంచంద్రారెడ్డి పనిచేస్తున్నారు. తనకు ఏమాత్రం సమయం దొరికినా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. కరోనా కారణంగా పాఠశాలకు సెలవులు ప్రకటించిన క్రమంలో తొలిరోజుల్లో సమయం ఎలా గడుస్తుందో అని ఆందోళన చెందారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ క్లాసులు, వెబ్‌నార్‌, క్విజ్‌లపై దృష్టి సారించి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం 100రోజుల్లో 38వెబ్​నార్​లు, 44క్విజ్​లలో పాల్గొని 105 ధ్రువపత్రాలు పొందారు.

ఆన్‌లైన్‌ క్లాసుల్లో ఉస్మానియా, నల్సార్‌, కాకతీయ, బెంగుళూరుకు చెందిన విశ్వవిద్యాలయాల నుంచి ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోగలిగానని రాంచంద్రారెడ్డి చెప్పారు. ఈ క్రమంలోనే వినియోగదారుల చట్టాలపై నల్సార్‌ వర్సిటీ అవగాహన కల్పించిందన్నారు.

"కరోనా కారణంగా అనేక రంగాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో విలువైన సమయాన్ని వాట్సప్‌‌, యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఆన్‌లైన్ గేమ్​లతో వృథా చేస్తున్నారు. అలా చేయకుండా యువత విరామ సమయాన్ని వినియోగించుకోవాలి."

-కోల రాంచంద్రారెడ్డి, గణిత ఉపాధ్యాయుడు, పెద్దపల్లి జిల్లా

ఇదీ చదవండి:పద్మాసనంతో సముద్రంలో ఈత.. కర్ణాటకవాసి అరుదైన ఘనత

ABOUT THE AUTHOR

...view details