Gorakhpur Express Stopped in Due to Rains : పట్టాలపై భారీగా వరద నీరు చేరడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును.. అధికారులు అర్ధాంతరంగా నిలిపివేశారు. మంగళవారం మధ్యాహ్నం గోరఖ్‌పూర్ నుంచి బయలుదేరిన రైలు నేడు సికింద్రాబాద్‌కు చేరాల్సి ఉంది. కానీ పెద్దపల్లి రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొద్దిదూరంలో పట్టాలపైకి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమై.. రైలును నిలిపివేశారు. ఫలితంగా 3 గంటలుగా ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లోనే నిరీక్షించాల్సి వస్తుంది. మరోవైపు స్టేషన్‌లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే రైల్వే అధికారులు స్పందించి.. తమను గమ్యస్థానాలకు చేర్చాలని వారు కోరుతున్నారు.
మరోవైపు హసన్‌పర్తి- కాజీపేట మార్గంలోని ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేశామని.. పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేశామని, కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైల్వే ట్రాక్‌పై భారీగా వరద నీరు నిలవడంతో.. మూడు రైళ్లను పూర్తిగా.. నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే 9 రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ -17012, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ -17233, సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ -17234 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తిరుపతి - కరీంనగర్ -12761, కరీంనగర్ - తిరుపతి -12762, సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ -12757, సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ -12758 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వెల్లడించింది.