తెలంగాణ

telangana

ETV Bharat / state

గోదావరి జలాల్లో హానికారక కొలిఫామ్స్ బ్యాక్టీరియా - godavari water polluted in ramagundam

కోట్లాది మంది గొంతు తడుపుతున్న గోదారమ్మ పరిసర ప్రాంత వాసులకు మాత్రం గరళాన్నే అందిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పక్కన జీవనది కాలుష్య కాసారంగా మారింది. గత అక్టోబరులో గోదావరిఖని పరిసరాల్లోని గోదావరి జలాలను పరీక్షించిన కాలుష్య నియంత్రణ మండలి.. ప్రమాదకరమైన కొలిఫామ్స్ అనే బ్యాక్టీరియా జలాల్లో విస్తరిస్తోందని తెలిపారు.

godavari water, godavari water pollution
గోదావరి జలాలు, గోదావరి జలాలు కాలుష్యం

By

Published : May 15, 2021, 7:41 AM IST

రాష్ట్రంలో లక్షలాది ఎకరాల భూములకు సాగు నీరందిస్తూ, కోట్లాది మంది గొంతు తడుపుతున్న గోదావరి.. పరిసర ప్రాంత వాసులకు మాత్రం గరళాన్నే అందిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పక్కన జీవ నది కాలుష్య కాసారంగా మారింది. డ్రెయినేజి నీరు, స్థానిక పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలకు.. వాడి పారేసిన ప్లాస్టిక్‌, ఇతరత్రా చెత్త తోడవుతుండటంతో జలాలు కలుషితమవుతున్నాయి. గత అక్టోబరులో గోదావరిఖని పరిసరాల్లోని గోదావరి జలాలపై నురగ లాంటి పొర పేరుకుపోవడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పరీక్షలు నిర్వహించి మురుగు కలవడమే కారణమని తేల్చారు. ప్రమాదకరమైన ‘కొలిఫామ్స్‌’ అనే బ్యాక్టీరియా జలాల్లో విస్తరిస్తుండటంతో మానవాళికి ముప్పు అని హెచ్చరించారు.

నిల్వ నీటిలో మురుగు

కాళేశ్వరం పథకంలో భాగంగా గోదావరిలో ఏడాది పొడవునా నీరు నిల్వ ఉంటోంది. గతంలో ప్రవాహం ఉన్న సమయంలో పెద్దగా మురుగు ప్రభావం కనిపించలేదు. మంథని సమీపంలోని సుందిళ్ల(పార్వతి) బ్యారేజీ నిల్వ నీరు అంతర్గాం మండలం గోయల్‌వాడ పంపుహౌస్‌ వరకు ఉంటోంది. ఇందులో మురుగు కలవడంతో నదీ జలాలు కలుషితమవుతున్నాయి. అంతర్గాం మండలం ఎల్లంపల్లి-ముర్మూరు పంప్‌హౌస్‌ నుంచి రామగుండం, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లోని 8 లక్షల జనాభాకు ప్రస్తుతం ప్రతి రోజూ 41 ఎంఎల్‌డీ(మిలియన్‌ లీటర్‌ పర్‌ డే)ల తాగు నీటిని సరఫరా చేస్తున్నారు.

నిత్యం 43.57 ఎంఎల్‌డీల మురుగు

  • రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగు ప్రధాన నాలాల నుంచి నిత్యం 43.57 ఎంఎల్‌డీల మురుగు గోదావరిలో కలుస్తోంది.
  • ఇందులో రామగుండం నాలా నుంచి 7.20 ఎంఎల్‌డీలు, మల్కాపూర్‌ నాలా నుంచి 22.22, ఫ్లయింక్లైన్‌ నాలా నుంచి 7.63, టూఇంక్లైన్‌ నాలా నుంచి 6.52 ఎంఎల్‌డీలు నేరుగా గోదావరిలో కలిసి నీరు కాలుష్యమవుతోంది. ఎన్టీపీసీ, జెన్‌కో పరిశ్రమల వ్యర్థాలు మల్కాపూర్‌ నాలాలో, ఫ్లయింక్లైన్‌, టూఇంక్లైన్‌ల నుంచి సింగరేణి పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలోకి చేరుతున్నాయి.
  • దశాబ్దాల కిందట రామగుండంలో 4 ఎంఎల్‌డీలు, మల్కాపూర్‌లో 14, సుందిళ్లలో 15 ఎంఎల్‌డీల సామర్థ్యం కలిగిన శుద్ధీకరణ ప్లాంట్లను దాదాపు రూ.5 కోట్లతో నిర్మించారు. ఇవన్నీ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి.
  • నాలాల్లో మురుగు ప్రవహిస్తుండటంతో గుర్రపు డెక్క పెద్ద ఎత్తున పెరిగి పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. నదిలో పుణ్యస్నానాల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కాలుష్య జలాలు అనారోగ్య కారకాలుగా మారుతున్నాయి.
  • ఇటీవల రూ.90 కోట్లతో 21 ఎంఎల్‌డీల సామర్థ్యం కలిగిన మురుగు శుద్ధీకరణ ప్లాంటు నిర్మాణం కోసం అధికారులు ప్రతిపాదించినా పనులు సాగడం లేదు.

కొలిఫామ్స్‌ బ్యాక్టీరియాతో పొంచి ఉన్న ప్రమాదం

గోదావరి నీటి నాణ్యత పరిశీలిస్తే ప్రమాదకరమైన కొలిఫామ్స్‌ బ్యాక్టీరియా కలిసినట్లు వెల్లడైంది. ఈ బ్యాక్టీరియా కలిగిన నీటిని మనుషులు తాగితే శ్వాస, ఉదర, చర్మ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తాయి. ఈ నీటితో పంటలు కూడా పండవు. ఇప్పటికైనా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మురుగు జలాల శుద్ధీకరణను చిత్తశుద్ధిగా చేపట్టాలి.

- గీట్ల దామోదర్‌రెడ్డి, గోదావరి నది పరిరక్షణ సమితి అధ్యక్షుడు

నోటీసులు జారీ చేశాం

జల, వాయు, కాలుష్య వ్యాప్తికి కారణమవుతున్న సింగరేణి, ఎన్టీపీసీ, రామగుండం నగరపాలక సంస్థలకు నోటీసులు జారీ చేశాం. నివారణ చర్యలు తీసుకుంటామని వారు సంజాయిషీలో పేర్కొన్నారు. గోదావరిలో మురుగు కలవకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలని రామగుండం నగరపాలక, మంచిర్యాల పురపాలక కమిషనర్‌లకు సూచించాం. ప్రతి నెలా నదీ జలాల నమూనాలను సేకరించి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నాం.

- రవిదాస్‌, కాలుష్య నియంత్రణ మండలి ఇంజినీర్‌

ABOUT THE AUTHOR

...view details