Flexi issue in trs: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన తెరాస పార్టీ సర్వసభ్య సమావేశంలో ఫ్లెక్సీ వివాదం కలకలం సృష్టించింది. వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావుకు స్థానిక నాయకులు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఎమ్మెల్సీ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ నేత ఫోటోను చిన్న సైజులో ముద్రించారంటూ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి వర్గానికి చెందిన నాయకులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు.
ఒక సందర్భంలో ఎమ్మెల్సీ అనుచరులు ఫ్లెక్సీని చించే ప్రయత్నం చేయగా.. మంత్రి కొప్పుల ఈశ్వర్ జోక్యం చేసుకొని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని నూతనంగా పెద్దపల్లి తెరాస పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇరువర్గాలకు హామీ ఇచ్చారు.