farmers problems: యాసంగిలో వరి సాగు చేయవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తున్నారు. దశాబ్దకాలంగా వరి సాగు చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలతో ఇతర పంటలను సాగు చేస్తున్న రైతులకు సాగు కష్టాలు మొదలయ్యాయి. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లానాయక్తండా గ్రామపంచాయతి అనుబంధ గ్రామాలైన రాజీవ్తండా, ఓల్డ్ బామ్లానాయక్ తండా, కన్నాల గ్రామాల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శక్తికి మించి ఖర్చు చేసి సాగు ప్రారంభించిన రైతులు ప్రత్యామ్నాయ పంటలతో గోస పడుతున్నారు. వరి మినహా మిగిలిన ఏ పంటలు పండించే అలవాటు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త సాగులో మెలకువలు తెలియకపోవడం.. ఎస్సారెస్పీ నీటి తడులు సరిగా అందకపోవడం.. విత్తనాలు దొరకకపోవడం వంటి సమస్యల మూలంగా సాగు వ్యయప్రయాసలు పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బామ్లానాయక్తండా పంచాయతీ పరిధిలోని 200 ఎకరాల్లో 50 శాతం మంది రైతులు వేరుశనగ, జొన్న, కూరగాయలు, మొక్కజొన్న, ఇతర తడి పంటలు వేశారు. 30 శాతం మంది రైతులు తమ పొలాలను బీడు భూములుగా ఉంచగా.. మిగిలిన 20 శాతం రైతులు వెదజల్లు పద్ధతులతో వరి సాగు చేస్తున్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు సంబంధించిన కాలువల ద్వారా నీటి సరఫరా సమృద్ధిగా లేకపోవడంతో సాగు కష్టాలు రెట్టింపయ్యాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి సాగు చేస్తున్నామని అయితే అనుకోకుండా నష్టాలు పలకరిస్తున్న క్రమంలో నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. సరైన అవగాహన లేక పంట వేసి నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ వడ్లు వేయొద్దు. వేస్తే కొనమని చెప్పడంతో పల్లి పంట వేశాను. పాత పంట వేస్తే వద్దన్నరు. కొత్త పంట వేస్తే తెల్వక నష్ట పోయాం. వ్యవసాయ అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో దెబ్బతిన్నాం.