Farmers Problems in Telangana : అకాల వర్షాలతో ఇప్పటికే ఎంతో నష్టపోయిన అన్నదాతలు.. కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల దోపిడీతో మరింత దగాకు గురవుతున్నారు. మిగిలిన కాసింత ధాన్యాన్నీ అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కొనుగోళ్లు సక్రమంగా జరగక.. పలుచోట్ల లారీలు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తరుగు పేరిట మరింత నష్టపోతున్నారు. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు, మిల్లుల్లో తూకంలో కోతల ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
40 కిలోల బస్తా నుంచి మార్కెట్ యార్డు అధికారులు తరుగు పేరుతో రెండు నుంచి మూడు కిలోల ధాన్యం సేకరిస్తున్నట్లు ఈ సందర్భంగా రైతులు ఆయన దృష్టికి తెచ్చారు. మిల్లులకు వెళ్లిన తర్వాత అక్కడా మిల్లు యజమానులు తూకంలో మరో రెండు కిలోలు కోత విధిస్తున్నట్లు వాపోయారు. స్థానిక ప్రజా ప్రతినిధుల పర్యవేక్షణ కొరవడటంతోనే అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రమణా రావు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మిల్లుల యజమానులతో కుమ్మక్కు కావడం వల్లే కోతల పేరుతో రైతుల దోపిడీ జరుగుతోందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
''స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ కొరవడటంతోనే అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మిల్లుల యజమానులతో కుమ్మక్కు కావడం వల్లే కోతల పేరుతో రైతుల దోపిడీ జరుగుతోంది.'' - విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే
మార్కెట్‌లో బైఠాయించి అన్నదాతల నిరసన..: మరోవైపు.. లారీలు రావడం లేదనే కారణంతో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోవడంతో మంథని మండలం చిన్న ఓదాల గ్రామంలో అన్నదాతలు మార్కెట్‌లోనే బైఠాయించి నిరసన తెలిపారు. గ్రామానికి చెందిన సుమారు 200 మంది రైతులు.. నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయినా కొనుగోళ్లు జరగకపోవడంతో నేడు మార్కెట్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. లారీలు రావడం లేదని, 3 కిలోల తరుగుకు ఒప్పుకున్నా.. కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.