Farmer suicide attempt in front of Peddapally District Collectorate : రాష్ట్రంలో భూతగదాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించమంటూ బాధితులు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడంలేదు. అధికారుల అలసత్వం, భూవ్యవస్థ నిర్వహణలో లోపం మొదలగు కారణాలతో భూసమస్యల పరిష్కారం అందని ద్రాక్షగా మారింది.
తమ అన్నదమ్ముల మధ్య నెలకొన్న భూసమస్యలను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారని రైతు మనస్థాపం చెందాడు. ధర్మారం మండలం కిలా వనపర్తికి చెందిన రాంచంద్రరావు అనే రైతు పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తనతో పాటు తన ఇద్దరు అన్నదమ్ములు ఒక్కొక్కరికి 14 ఎకరాల భూమిని గతంలో సమానంగా పంచుకున్నట్లు తెలిపారు. కాగా తనకున్న 14 ఎకరాల్లో ఏడెకరాలను తన ఇద్దరు సోదరులు.. తన సంతకాలని ఫోర్జరీ చేసి వేరే వారికి భూమి అమ్మినట్లు తెలిపారు.
ఈ విషయమై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో.. ఈ రోజు పెద్దపెల్లి కలెక్టర్‌ను ఆశ్రయించాడు. కానీ కలెక్టరేట్లోని అధికారులు సైతం తనను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో.. బయటకు వచ్చిన రాంచంద్రరావు తన వెంట తీసుకొచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు.