Schools In Brick kiln: పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీల్లో పని చేయడానికి వేలాది మంది కూలీలు కుటుంబ సమేతంగా వలస వస్తుంటారు. ఏటా నవంబర్ నుంచి మే వరకు బట్టీల్లో పనులు కొనసాగుతాయి. కొంత మంది గుత్తేదారులు వివిధ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తుంటారు. ఈ వలసల కారణంగా చదువుతో ఉత్తమ భవిష్యత్‌ను అందుకోవాలని ఆశించినా, ఆర్థిక స్థితిగతుల అడుసులో కూరుకుపోయి చిన్నారులు.. పాఠశాలకు దూరమై పోతున్నారు.
తల్లిదండ్రులు సైతం బతుకు భారాన్ని అతి పిన్న వయస్సుల్లోనే చిన్నారులపై వేయాల్సిన పరిస్థితి ఉండేది. పలక,బలపం చేతబట్టి అక్షరాలు దిద్దాల్సిన బాల్యం.. నల్లమట్టిని ఇటుకలుగా మార్చే పనిలో మగ్గిపోయేది. దీంతో పెద్దపల్లి జిల్లా పోలీసులు సరికొత్త ప్రణాళికను అమలు చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 80 ఇటుక బట్టీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వందల సంఖ్యలో ఇక్కడికి వలస వచ్చి పనిచేస్తున్నట్లు.. వారి కోసం ఆయా బట్టీల్లోనూ పాఠశాలలు ఏర్పాటు చేయాలని యజమానులకు సూచించారు.
కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు:తూతూ మంత్రంగా కాకుండా చిన్నారులను ఆకర్షించే విధంగా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. బొమ్మలు, రంగు రంగుల పెయింటింగ్స్ ఆటవస్తువులు టీవీ, ఎల్‌ఈడీలతో తీర్చిద్దడంతో చిన్నారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కార్టూన్ల ద్వారా చుదువుకోవడంతో పాటు టీవీ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. యునిఫాంతో పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు.