Couple Suicide in Peddapalli :నేటి కాలంలో చిన్నపాటి కారణాలతో.. క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న అపజయాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రేమ విఫలమైందని ఒకరు.. పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు... భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని.. కుటుంబంలో సమస్యలను తట్టుకోలేక చాలా మంది ప్రాణాలు విడుస్తున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్నవారిని విషాదంలో నెట్టేస్తున్నారు.
Peddapalli Couple Suicide :ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న కుటుంబం వారిది. కానీ ఈ క్రమంలోనే ఆ దంపతుల మధ్య ఆర్థిక ఇబ్బందులు చిచ్చురేపాయి. ఈ విషయమై పలుమార్లు వారి మధ్య గొడవలు జరిగాయి. ఈ సమస్యలన్నింటికి చావే పరిష్కారమని ఆ భార్యాభర్తలు భావించారు. అనుకున్నదే తడవుగా వారు సోమవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి (Committed Suicide) పాల్పడ్డారు. కానీ అభంశుభం తెలియని ఆ పసిబిడ్డలను దిక్కులేని వారు చేశారు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో (Peddapalli District) చోటుచేసుకుంది.
విషాదం... ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం ఎక్లాస్‌పూర్ పంచాయతీ పరిధిలోని నెల్లిపల్లికి చెందిన కటుకు అశోక్ - సంగీతలకు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలుండగా.. కూలీ పనులు చేసుకుంటూ భార్యాభర్తలు జీవనం సాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. డబ్బుల విషయంలో వారి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.