అంతర్జాతీయ విపణిలో పెరిగిన గిరాకీకి అనుగుణంగా పత్తి ధరల్లో పురోగమనం మొదలైంది. గతేడాది అక్టోబరు నెలాఖరులో పెద్దపల్లిలో పత్తి మార్కెట్ ప్రారంభమైంది. కాగా గత రెండేళ్లలో ఎదురైన ఒడుదొడుకులతో మార్కెట్‌కు పత్తి రాక తగ్గింది. మరోవైపు మిల్లుల వద్దే సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల మార్కెట్‌కు వచ్చే రైతుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గతంలో మార్కెట్‌లోకి వచ్చేందుకు గేట్ల వద్ద రైతుల వాహనాలు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇపుడు ఆ పరిస్థితి కొనుగోలుదారులకు వచ్చింది. మరోవైపు ఈ సీజన్‌లో వాతావరణ పరిస్థితులతో పత్తి దిగుబడులు తగ్గడం వల్ల ఆ ప్రభావం మార్కెట్‌పై పడింది. ఈ క్రమంలో పత్తికి డిమాండ్ పెరగి వ్యాపారులు ధరల యుద్ధానికి తెర లేపారు.
దళారులను నియంత్రిస్తేనే ప్రయోజనం
సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర రూ.5725కు నిర్దేశిత ప్రమాణాలు కలిగిన పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ప్రమాణాలను అందుకోలేని సరకులు మిల్లు యాజమాని ఇచ్చిన ధరకే విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ దిగుబడి వచ్చిన చిన్న కమతాల రైతులకు మార్కెట్‌లో ధరలపై అవగాహన లేకపోవడం, గతం కంటే ఎక్కువ ధర చెల్లించేందుకు దళారీ ముందుకు రావడం, క్వింటాలుకు రూ.5000 నుంచి రూ.5200 వరకు గ్రామాల్లోనే ధర లభిస్తుండంతో ఇళ్ల వద్దే విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన పత్తి నేరుగా ఇతర రాష్ట్రాలకు చేరుతోంది. ఒక్క పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే నిత్యం సగటున 10 లారీల పత్తి మహారాష్ట్రకు తరలిపోతోంది. ఈ పరిస్థితుల్లో పత్తి కోసం మార్కెట్‌లో వ్యాపారులు డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెంచుతున్నారు. అయితే దళారులు నిర్ణయించే ఏకరీతి ధరతో రైతుల కంటే వారికే ఎక్కువ ప్రయోజనం దక్కుతోంది. కాగా గ్రామాల్లో దళారుల నియంత్రణకు ప్రత్యేక వ్యవస్థ లేకపోవడం, వ్యవసాయ మార్కెట్‌లకు సొంత నిఘా వ్యవస్థ లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.