పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు కరోనా నిర్ధరణ పరీక్షల కోసం ప్రజలు తరలివచ్చారు. రెండు రోజులుగా వైద్యశాలలో తక్కువమందికే నిర్ధరణ పరీక్షలు చేశారని అసహనం వ్యక్తం చేశారు. కరోనా సోకిందో లేదో తెలుసుకోవడానికే రోజులు గడిచిపోతున్నాయని వాపోయారు.
ఉదయం ఆరు గంటల నుంచి కరోనా అనుమానిత ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి వేచి ఉండలేక చెప్పులను, ఇతర వస్తువులను వరుసక్రమంలో పెట్టి.. అక్కడ పరిసర ప్రాంతాల్లో సామాజిక దూరం పాటిస్తూ పడిగాపులు కాస్తున్నారు. ఇలా ఎక్కువసేపు వేచి ఉండడం వల్ల కరోనా వచ్చే ప్రమాదముందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిర్ధరణ పరీక్షలు చేసిన తర్వాత గ్రామాలకు వెళ్లాలంటే లాక్డౌన్ వల్ల ప్రయాణించేందుకు వాహనాలు దొరకట్లేదని.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.