ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అప్పుల పాలవుతున్నారని పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఎడ్లబండ్లు, సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భూపాలపల్లి హనుమాన్ టెంపుల్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ఇంధన, నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రూ.63 ఉన్న లీటర్ పెట్రోలు భాజపా ప్రభుత్వంలో వందరూపాయలు దాటిందని మండిపడ్డారు. ధరలు పెరగడం వల్ల ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి జీతం సరిపోక అప్పులపాలవుతున్నారని అన్నారు.
ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో..
రైతులకు రైతుబంధు ఇస్తున్నామని చెప్పుకుంటున్న తెరాస ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నుల వసూళ్లు చేస్తోందని ఆరోపించారు. ఒక చేత్తో డబ్బులు ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారని ఆయన విమర్శించారు. ఇంధన ధరలతోపాటు ఎరువులు కూడా పెరిగి రైతులకు వ్యవసాయంపై పెట్టుబడి భారమవుతోందని తెలిపారు. ధరలు పెరగడం వల్ల రైతులకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. జిల్లాలో అధికారులు, మిల్లర్లు కుమ్మక్కై క్వింటాల్ ధాన్యానికి 10 కిలోలకు పైగా తరుగు తీస్తున్నారని శ్రీధర్ బాబు ఆరోపించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదన్నారు. రైతుబంధు,ఆసరా పెన్షన్లు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికి మంచి గిట్టుబాటు ధర పెంచి ధాన్యాన్ని కొనుగోలు చేసుకోవాలని డిమాండ్ చేశారు.