అడుగడుగునా అవాంతరాలను అధిగమిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారంలో మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు యూరియా వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించారు. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఫిబ్రవరి 28న ప్రయోగాత్మకంగా యూరియా ఉత్పత్తిని అధికారులు మొదలుపెట్టారు. గత మార్చి నెలాఖరులోగా ఇక్కడ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభిస్తామని తొలుత అధికారులు ప్రకటించినప్పటికీ.. వివిధ విభాగాల్లో ఎదురైన సమస్యలను సవరించుకుంటూ మూడు నెలలు ఆలస్యంగా ఇప్పుడు పట్టాలెక్కించారు.
పీసీబీ అనుమతి
ప్రయోగాత్మకంగా యూరియా ఉత్పత్తి చేపట్టినప్పటి నుంచి పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇటీవల ఎదురైన అమ్మోనియా గ్యాస్ లీకేజీ.. రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల్లో గందరగోళం సృష్టించింది. అధికారులు ఆ సమస్యను పరిష్కరించి మంగళవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. రూ.25 లక్షల బ్యాంకు గ్యారంటీ జమ చేయడం సహా పలు షరతులతో ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తికి హైదరాబాద్ కార్యాలయం నుంచి సోమవారం అనుమతులు వచ్చాయని రామగుండం ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారి రవిదాస్ తెలిపారు. ఇకపై ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉత్పత్తిని కొనసాగిస్తూ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత తీర్చడంలో రామగుండం ఎరువుల కర్మాగారం భాగస్వామ్యం కానుంది.