Bus ticket to Cock: ఆర్టీసీ బస్సులో ప్రయాణించేటప్పుడు చిన్నపిల్లలకు టికెట్లు తీసుకునే సమయంలో కండక్టర్‌ను.. కొంతమంది ప్రయాణికులు సతాయిస్తుంటారు. కానీ.. ఆ కండక్టర్ మాత్రం పట్టువదలకుండా.. ఆ చిన్నారులకు టికెట్ కొడతాడు. ఇంకొందరు కండక్టర్లు లగేజీ విషయంలోనూ రాజీ పడకుండా.. ఛార్జీలు వసూలు చేస్తారు. ఇదంతా ఓ ఎత్తైతే.. ఈ కండక్టర్ మాత్రం తగ్గేదెలే అంటూ.. ఓ కోడిపుంజుకు టికెట్ కొట్టాడు. ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
కోడికి రూ.30 టికెట్..
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. గోదావరిఖని నుంచి కరీంనగర్ వెళ్తుంది. మహమ్మద్ అలీ అనే ప్రయాణికుడు.. బస్సెక్కాడు. కరీంనగర్ వెళ్లేందుకు టికెట్ తీసుకున్నాడు. అయితే అలీ తన వెంట ఓ కోడిపుంజును కూడా తెచ్చుకున్నాడు. బస్సు సుల్తానాబాద్ వద్దకు చేరుకున్నాక.. కండక్టర్ తిరుపతికి కోడిపుంజు శబ్దం వినిపించగా ఈ విషయాన్ని గమనించాడు. వెంటనే.. కోడికి రూ.30 టికెట్ కొట్టి అలీ చేతికిచ్చాడు కండక్టర్. ఆ టికెట్ చూసిన అలీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
ప్రాణమున్న ప్రతీ జీవికి..
షాక్ నుంచి తేరుకుని కోడికి టికెట్ ఎంటని అడిగితే.. "ప్రాణం ఉన్న ప్రతీ జీవికి టికెట్ తీసుకోవాల్సిందే" అని ఆ కండక్టర్ చెప్పిన సమాధానానికి మళ్లీ అలీకి దిమ్మదిరిగిపోయింది. ఏమి చేయలేక టికెట్‌కు సరిపడా డబ్బులిచ్చి.. అలీ కరీంనగర్‌కు ప్రయాణమయ్యాడు.