Bhatti Vikramarka Open Letter to CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలకు.. 5 శాతం బడ్జెట్ కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై సీఎంకు బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. పాదయాత్రలో భాగంగా అనేకమందితో మాట్లాడానని చెప్పారు. బడుగుబలహీన వర్గాలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని భట్టి విక్రమార్క అన్నారు.
ఉమ్మడి రాష్ట్రం కంటే అధ్వాన్నంగా:స్వరాష్ట్రం వస్తే నిధులు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు భావించారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కానీ పరిస్థితి ఉమ్మడి రాష్ట్రం కంటే అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. 54 శాతం ఉన్న బలహీన వర్గాలకు కేవలం 5 శాతం కేటాయిస్తున్నారని అన్నారు. కేటాయించిన నిధులను కూడా సరిగ్గా విడుదల చేయడం లేదని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని బీసీలు, వివిధ వర్గాలతో మాట్లాడిన తర్వాత.. ఈ మేరకు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశానని భట్టి విక్రమార్క చెప్పారు.
దళిత బంధు తరహాలో బీసీ బంధు: జనాభా ప్రాతిపదికన.. దామాషా పద్ధతిన నిధులు కేటాయించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. దళిత బంధు తరహాలో బీసీ బంధు కూడా ప్రారంభించాలన్నారు. ఈ సంవత్సరం రూ.2.90లక్షల బడ్జెట్లో బీసీలకు కేటాయించింది కేవలం 5 శాతం అని తెలిపారు. రాష్ట్రంలో అధిక శాతం జనాభా బీసీలు ఉన్న దృష్ట్యా.. బీసీ బంధు పథకం అమలు చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారని గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన 54శాతం కేటాయించాలని కోరుతున్నానని చెప్పారు. ఆ తర్వాత ఎలా వినియోగించాలో ఆలోచిద్దామని భట్టి విక్రమార్క వివరించారు.