Bhatti vikramarka Comments on CM KCR: దేశ రాజకీయాల్లో కేసీఆర్ రాజకీయ చదరంగం ఆడుతుంటే చూడటానికి.. తెలంగాణ ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా.. పెద్దపల్లి జిల్లా ముర్మూర్ నుంచి బ్రాహ్మణపల్లి వరకు పాదయాత్ర కొనసాగింది. మార్గమధ్యలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన ఆరా తీశారు. రాష్ట్రం ఏర్పడితే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఉండదని కేసీఆర్ ప్రకటించారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ రామగుండం నగరం నడిబొడ్డున ఓపెన్ కాస్ట్ మైనింగ్‌లు ప్రారంభించి.. చిన్నపాటి భూకంపాలకు కారణమయ్యారని మండిపడ్డారు.
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడం ఈ ప్రాంతానికి శాపంగా మారిందని భట్టి పేర్కొన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించాల్సిన ఈ సర్కార్.. కాంట్రాక్టు ఉద్యోగాల పేరుతో ఉద్యోగాలను కొల్లగొడుతోందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీపీఎల్ కంపెనీ కోసం 1200 ఎకరాల భూములు సేకరించి దశాబ్దకాలమవుతున్నా.. ఇప్పటి వరకు కంపెనీ ఏర్పాటు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కంపెనీ ఏర్పాటు చేయకుంటే సేకరించిన భూములను వెంటనే రైతులకు ఇవ్వాలని.. లేదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసమైనా వాటిని కేటాయించాలని డిమాండ్ చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో అవుట్ ఏజెన్సీ సంస్థను సృష్టించి.. కాంట్రాక్టు లేబర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని స్థానిక ఎమ్మెల్యే డబ్బులు వసూలు చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందని? అని భట్టి విక్రమార్క అన్నారు.
ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు:ప్రజా సమస్యలను గాలికొదిలేసిన మంత్రులు.. ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ ప్రాంత ప్రజల కోసం ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని విధాలుగా అత్యధిక దోపిడీకి గురైన నియోజకవర్గం రామగుండం అని పేర్కొన్నారు. తలాపునే గోదావరి ఉన్నప్పటికీ రెండు మండలాల రైతులకు తాగు, సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.