వామన్ రావు, నాగమణి దంపతుల హత్య న్యాయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యను రాష్ట్ర బార్ కౌన్సిల్, హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం చట్టాన్ని రూపొందించాలని బార్ కౌన్సిల్ ఛైర్మన్ నర్సింహారెడ్డి కోరారు. గురువారం మధ్యాహ్నం హైకోర్టు వద్ద నిరసన వ్యక్తం చేయాలని న్యాయవాదుల సంఘం తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదుల సంఘాలు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి, డీజీపీకి పంపించాలని అసోసియేషన్ కోరింది. నిందితుల తరఫున న్యాయవాదులు వాదించవద్దని బార్ కౌన్సిల్ కోరింది.
ప్రాణహాని ఉందని సీజేకు ఫిర్యాదు
వామన్ రావు, నాగమణి దంపతులు హైకోర్టులో చురుగ్గా ఉండేవారు. మంథనికి చెందిన వామన్ రావు, శ్రీకాకుళానికి చెందిన నాగమణిది ప్రేమ వివాహం. హైకోర్టు విభజన ఉద్యమాల్లోనూ ఇద్దరూ క్రియాశీలకంగా వ్యవహరించారు. పలు వివాదాస్పద అంశాల్లో సామాజిక మాధ్యమాల్లో స్పందించే వారు. కరోనా సమయంలో పేద న్యాయవాదులతో పాటు వివిధ వర్గాలకు బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. కానీ ఇటీవల పలు కేసుల విషయంలో తమకు ప్రాణహాని ఉందని వామన్‌రావు దంపతులు సీజేకు ఫిర్యాదు చేశారు. అంతలోనే హత్యకు గురవడం తీవ్ర కలకలం రేపుతోంది.