గంగపుత్రుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని అఖిల భారత గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు సత్యం బెస్త అన్నారు. నవంబర్ 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగపుత్ర దివస్ను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా మంథని మండలం బెస్తపల్లి గ్రామ సమావేశంలో పాల్గొన్నారు.
అప్పుడే గుర్తొస్తారు:
"బెస్తపల్లి గ్రామంలోని అన్ని కుటుంబాలు కలిసి గంగామాత చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. గంగపుత్ర దివస్ను నిర్వహించుకొని గంగపుత్రుల ఐక్యతను చాటాలి. గోదావరి నదిపై నిర్మించిన పార్వతి బ్యారేజ్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోనే బెస్తపల్లి గ్రామం ఉంది. అయినా గంగ పుత్రులు ఎలాంటి హక్కులు పొందలేకపోతున్నారు.
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అధికారులు బెస్తపల్లికి చెందిన గజ ఈతగాళ్లను వాడుకుంటారు. తర్వాత వాళ్లను పట్టించుకునేవారే ఉండరు. జీవో నంబర్ 6ను ప్రభుత్వం రద్దు చేయాలి. గ్రామం నుంచి జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి గ్రామానికి వచ్చే విధంగా.. గ్రామంలో మత్స సొసైటీలు ఏర్పాటు చేయాలి. వారి జీవనోపాధికి బాటలు వేయాలి."