రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మధనపడుతుంటే... ఇప్పుడు అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి సుల్తానాబాద్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిచిపోయింది. దాదాపు 5000 క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం నీట మునిగింది.
15రోజుల క్రితమే మార్కెట్కు వచ్చిన ధాన్యం...
సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గత 15 రోజుల క్రితం రైతులు అమ్మకానికి ధాన్యం తీసుకొచ్చారు. అధికారులు హమాలీల కొరత ఉందంటూ నేటికి కొనుగోలు చేయలేదు. కుండపోత వర్షం కురవడం వల్ల మార్కెట్ యార్డులోని వరి ధాన్యం నీటికి కొట్టుకుపోయింది. వర్షం నిలిచిపోగానే అన్నదాతలు తమ ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. నీటిని ఎత్తిపోయడం, ధాన్యాన్ని ఆరబెట్టె పనిలో నిమగ్నమయ్యారు.
గత వారం రోజుల వ్యవధిలో ఇప్పటివరకు మూడు సార్లు వర్షం కురిసింది. వడ్లు తడవకుండా ఉండేందుకు కనీసం టార్పాలిన్ కవర్లు కూడా అధికారులు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 5000 క్వింటాళ్లకు పైగా ధాన్యం తడిసినప్పటికీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
అకాల వర్షంతో... తడిసిముద్దైన ధాన్యం... ఇవీ చూడండి:ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత